కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'కెజిఎఫ్' సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అన్ని భాషల్లో ఈ సినిమా ట్రైలర్ కి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. సౌత్ లో భారీగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా తెలుగు వెర్షన్ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి మొదటి నుండి సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. నిన్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు రాజమౌళి. ఈ సందర్భంగా ఆయన హీరో యష్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ''కన్నడ ఇండస్ట్రీలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి..? టాప్ ప్లేస్ లో ఎవరున్నారని ఆరా తీయగా.. ఓ కొత్త అబ్బాయి వచ్చి.. అందరినీ దాటేసి వరుస హిట్స్‌ అందుకుంటున్నాడని.. తన పేరు యష్‌ అని అన్నారు.

అతని గురించి ఎప్పుడు వినలేదు.. ఎక్కడ నుండి వచ్చాడు? తన బ్యాగ్రౌండ్‌ ఏంటి? అని అడిగితే ఓ బస్‌ డ్రైవర్‌ కొడుకు అని చెప్పారు. ఓ బస్‌ డ్రైవర్‌ కొడుకు కన్నడ ఇండస్ట్రీలో పెద్ద స్టార్‌ అయ్యారు. మరో గొప్ప విషయమేమంటే కొడుకు సూపర్‌స్టార్‌ అయినా తండ్రి మాత్రం ఇంకా బస్‌ డ్రైవర్‌గానే ఉన్నారు.

యష్‌ కంటే ఆయన తండ్రే పెద్ద సూపర్‌స్టార్‌ అని నాకు అనిపించింది. ఆయనకు నా హ్యాట్సాఫ్‌'' అంటూ చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో డిసంబర్ 21న విడుదల చేయనున్నారు.