ఐదునెలల నిరీక్షణకు తెరదించుతూ దర్శకధీరుడు రాజమౌళి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ని పరిచయం చేశాడు. ప్రకటించిన విధంగా నేడు ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదలయ్యింది. ఎన్టీఆర్ అభిమానుల అంచనాలకు తగ్గ కుండా...రాజమౌళి మార్కు ఎలివేషన్స్ తో విజువల్ వండర్ లా ఫస్ట్ లుక్ వీడియో ఉంది. రాజమౌళి ప్రేక్షకులు ఊహించిన దానికి మించిన అనుభూతికి ఇస్తారని ఈ ఫస్ట్ లుక్ వీడియోతో మరోమారు రుజువు చేసుకున్నారు. 

రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మొదలుకాగా చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో మొదలైంది. '' ఆడు కనపడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం  చీకట్లను చీల్చే మండుటెండ, వాడు భూ తల్లి చను పాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ, నా తమ్ముడు గోండ్రు బెబ్బులి...కొమరం భీమ్'' అని చరణ్ చెప్పడం గూస్ బంప్స్ కలిగించింది. 

ఒక వీరుడిగా కొమరం భీమ్ మారే క్రమంలో ఆయన ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు, ఘోర శిక్షణ ఈ ఫస్ట్ లుక్ వీడియోలో చూపించారు. ఎన్టీఆర్ రాటు తేలిన కండలు, మొరటు శరీరం, కళ్ళలో కసి, ఆక్రోశం వీడియోలో హైలెట్ అని చెప్పాలి. ముఖ్యంగా రాజమౌళి విజువల్స్ కట్టిపడేశాయి.చివర్లో ఎన్టీఆర్ ని ఒక ముస్లిం గెటప్ లో చూపించడం కొస మెరుపు.  ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ నటవిశ్వ రూపం ఆవిష్కృతం కావడం ఖాయం అని ఈ వీడియో చెప్పకనే చెవుతుంది. మొత్తంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో తరువాత మూవీపై అంచనాలు ఆకాశాన్ని కూడా దాటిపోయాయి. 

డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేస్తుండగా ఆయనకు జంటగా శ్రీయా తక్కువ నిడివి కలిగిన పాత్రలో కనిపించనుంది. వచ్చే సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ విడుదల చేయాలని రాజమౌళి భావించారు. కోవిడ్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ విడుదల మరింత ఆలస్యం కానుంది. త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నట్లు రాజమౌళి తెలియజేశారు.