రామ్ చరణ్ తో రంగస్థలం మూవీని పూర్తి చేసేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయిపోగా.. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్.. మరోవైపు ప్రమోషనల్ వర్క్ జోరుగా సాగుతున్నాయి. రంగస్థలం అంటే ఓ ఊరిపేరు అనే విషయం ఇప్పటికే దర్శకుడు చెప్పేశాడు. ఇప్పుడీ రంగస్థలం ఊరికి దర్శక ధీరుడు రాజమౌళి వచ్చాడు. 


తన అసిస్టెంట్స్ తో కలిసి.. మొత్తం రంగస్థలం ఊరంతా తిరిగేశాడు. ఈ సమయంలో సుకుమార్ కూడా పక్కనే ఉన్నాడు. రంగస్థలం చిత్రం కోసం వేసిన ఊరు సెట్ లోని ప్రతీ అంగుళాన్ని పరిశీలించాడు రాజమౌళి. జక్కన్న ఇక్కడకు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓసారి వచ్చాడు. ఆ సమయంలో కూడా ప్రతీ డీటైలింగ్ ను మెచ్చుకున్నాడు. 30 ఏళ్ల క్రితం జ్ఞాపకాలను తిరిగి చూపించిన సుకుమార్ ను తెగ పొగిడేశాడు రాజమౌళి. ఇప్పుడు మళ్లీ తన యూనిట్ తో కలిసి రంగస్థలం ఊరిలో చక్కర్లు కొడుతున్నాడు. 
 

రాజమౌళి ఇలా రంగస్థలం గ్రామానికి ఇన్ని సార్లు ఎందుకు వస్తున్నాడనే ఆసక్తి అంతటా కనిపిస్తోంది. బహుశా తను తీయబోయే తర్వాతి సినిమాకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ సెట్ ను ఉపయోగించుకునేందుకు.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాడని.. అందుకే ఇన్నిసార్లు రంగస్థలంకు వస్తున్నాడనే అనుమానాలు తలెత్తుతున్నాయి.