మరో సంచలన చిత్రానికి రంగం సిద్ధం చేస్తున్న రాజమౌళి మహా భారతం ఆధారంగా భారీ చిత్రనిర్మానానికి సన్నాహాలు ఆమిర్, రజినీ, మోహన్ లాల్ లతో మహాభారతం తెరకెక్కించే పనిలో జక్కన్న ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా రూ.400 కోట్ల పైమాటే

భారత చలన చిత్ర పరిశ్రమలోని సినీ దిగ్గజాల్లో రజనీకాంత్, ఆమీర్‌ఖాన్, మోహన్‌లాల్‌లు. వీళ్ల ముగ్గురితో కలిసి మహాభారతాన్ని భారీ స్థాయిలో రూపొందించడానికి జక్కన్న రాజమౌళి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇటు బాహుబలి: ది కన్‌క్లూజన్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఆ సినిమా పనుల్లో బిజీగా ఉంటూనే మరో భారీ ప్రాజెక్ట్‌ పై సంచలన దర్శకుడు రాజమౌళి దృష్టిపెట్టినట్టు జాతీయ మీడియాలో పెద్దయెత్తున కథనాలు ప్రచురితమవుతున్నాయి. సూపర్ స్టార్స్ రజనీకాంత్, ఆమీర్‌ఖాన్, మోహన్‌లాల్‌ లతో మహాభారతాన్ని రూపొందించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని మీడియా పేర్కొంటోంది.

మహాభారతం అంటే రాజమౌళికి ఎంతో మక్కువ. ఈ పురాణంలోని కొన్ని ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకొని బాహుబలి రూపొందించినట్టు చెప్తుంటారు. రాజమౌళికి బాహుబలితో వచ్చిన ఇమేజ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకన్ని చేసింది. ఈ దర్శకుడు ఫుల్లుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్స్ ఆమీర్‌ఖాన్, రజనీకాంత్, మోహన్‌లాల్‌ను మహాభారత్ చిత్రంలో నటింపచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆమీర్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌ నటించిన చిత్రాలు భారతీయ సినిమా చరిత్రలోనే రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఆమీర్‌కు తగ్గని ఫాలోయింగ్ రజనీకి కూడా ఉంది. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలతోపాటు బాలీవుడ్‌లోనూ తలైవాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక మలయాళ, తెలుగు, తమిళ పరిశ్రమలో మోహన్‌లాల్‌కు చక్కని ఆదరణ ఉంది. దీంతో దేశవ్యాప్తంగా మహాభారత్ చిత్రానికి సూపర్ క్రేజ్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్‌ఖాన్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందని కోరికను బయటపెట్టాడు. దంగల్ ప్రమోషన్ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాజమౌళికి తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. మహాభారత్ చిత్రాన్ని తీస్తే కృష్ణ భగవానుడు లేదా కర్ణుడి పాత్రను పోషించాలని ఉందని వెల్లడించారు. సో.. అమీర్, రజినీ, మోహన్ లాల్ ల కాంబోలో రాజమౌళి సంచలనానికి తెరలేపేందుకు సిద్ధమవుతున్నాడన్నమాట.