దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై పూటకొక్క వార్త పుట్టుకొస్తోంది. రాజమౌళి ఈ చిత్రం కోసం ఇప్పటికే కొందరు కీలక నటుల్ని ఎంపిక చేశారు. మరికొందరిని ఎంపిక చేయాల్సి ఉంది. కొమరం భీం పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ కు హీరోయిన్ ని ఇంకా ఖరారు చేయలేదు. ఎన్టీఆర్ కు హీరోయిన్ గా ముందుగా అనుకున్న డైసీ ఎడ్గార్ జోన్స్ ఈ చిత్రం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. 

ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కోసం రాజమౌళి కొందరు ఫారెన్ భామలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో నిర్విరామంగా సాగే భారీ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తోంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ విషయంలో మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ సరసన ఓ ఫారెన్ హీరోయిన్ తోపాటు గిరిజన యువతి పాత్రలో మరో హీరోయిన్ నటించాల్సి ఉంది. 

తాజాగా రాజమౌళి సాయి పల్లవితో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. షూటింగ్ కు అనుగుణంగా భారీ సంఖ్యలో కాల్ షీట్స్ కేటాయిస్తే సాయి పల్లవిని ఓకే చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. సాయి పల్లవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ముందుగా ఈ పాత్రలో నిత్యామీనన్ పేరు వినిపించింది. ప్రస్తుతం సాయి పల్లవిని ఆ పాత్ర కోసమే రాజమౌళి సంప్రదించారా లేక మరేదైనా పాత్ర కోసమా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. 

ఆర్ఆర్ఆర్ చిత్రం 1920 కాలం బ్రిటిష్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపిస్తాడు. చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటించనున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగన్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కీలక సన్నివేశాల్లో కనిపిస్తాడు.