సూపర్ స్టార్‌ మహేష్‌బాబుతో దర్శకధీరుడు రాజమౌళి తీయబోయే సినిమాకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారనే దానిపై రాజమౌళి స్పందించారు.

`ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) చిత్రంతో సక్సెస్‌ కొట్టిన రాజమౌళి(Rajamouli) ఇప్పుడు ఇండియాలోనే మేటి డైరెక్టర్‌గా కీర్తించబడుతున్నారు. ఆయన్ని మించిన దర్శకులు లేరని అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా విజయవంతంగా రన్‌ అవుతుంది. ఇది ఇప్పటికే 700కోట్లు దాటేసిందని తాజాగా యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడిప్పుడే ఈ సినిమా హడావుడి నుంచి దర్శకుడు రాజమౌళి ఫ్రీ అవుతున్నారు. 

ఇప్పుడు ఆయన తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్‌ పెట్టారు. మహేష్‌బాబు(maheshbabu)తో తన తదుపరి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్‌ అడ్వెంచరస్‌గా ఈ సినిమాని ప్లాన్‌ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కబోతుందని సమాచారం. పాన్‌ ఇండియా లెవల్‌లో కౌ బాయ్‌, సాహసికుడు, జేమ్స్ బాండ్‌ పాత్రల మేళవింపుగా ఇందులోని మహేష్‌బాబు పాత్ర ఉండబోతుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు జక్కన్న. సినిమా ఎప్పుడు ప్రారంభించబోతున్నారో వెల్లడించారు. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రమోషన్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో, ఈవెంట్లలో పాల్గొంటున్నారు జక్కన్న. ఈ క్రమంలో ఆయన మహేష్‌తో సినిమా గురించి వెల్లడించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలోనే ఉందని వెల్లడించారు. స్టోరీ లైన్‌ రెడీ చేసుకోవడానికి, దాన్ని కొద్దిగా ప్రీ విజువలైజేషన్‌, ప్రీ ప్రొడక్షన్‌ రెడీ చేసుకోవడానికి ఆరేడు నెలలు పడుతుందన్నారు. అన్ని పూర్తి చేసుకుని ఈ ఏడాది చివర్లోనే షూటింగ్‌ స్టార్ట్ చేస్తామని తెలిపారు. ఇది డిఫరెంట్‌ జోనర్‌లో ఉంటుందని, ఇండియన్‌ సినిమా కంటే బిగ్గర్‌గా ఉంటుందని, పాన్‌ వరల్డ్ రేంజ్‌లో ఉంటుందని తెలిపారు. దాదాపు 700కోట్లతో చిత్రీకరించబోతున్నారట. 

ప్రస్తుతం మహేష్‌బాబు `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. కీర్తిసురేష్‌ కథానాయిక. ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఇది త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అనంతరం రాజమౌళి సినిమాని పట్టాలెక్కించబోతున్నారు. దాదాపు రెండేళ్లు మహేష్‌ ఈ సినిమాకే పరిమితం కాబోతున్నారని సమాచారం.