నిన్న ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల మధ్య చిన్న ఫన్నీ సంభాషణ జరిగింది. చెప్పినట్లు రేపు అయినా కొమరం భీమ్ ఫస్ట్ లుక్ వీడియో రాజమౌళి విడుదల చేస్తారని గ్యారంటీ లేదని...ఇది రాజమౌళితో కూడుకున్న వ్యవహారం అని ఎన్టీఆర్ చమత్కరించారు. దీనిని నిజం చేస్తూ రాజమౌళి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మరో అరగంట వెయిట్ చేయమని కోరాడు. 

ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో నేడు ఉదయం 11:00 లకు విడుదల కావాల్సి ఉంది. దేశంలోని అన్ని పరిశ్రమలలో భారీ క్రేజ్ ఉన్న ఆర్ ఆర్ ఆర్ అప్డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చుస్తున్నారు. ఐతే ఉదయం 11:00 కొమరం భీమ్ గా ఎన్టీఆర్ దర్శనం ఇస్తాడనుకుంటే రాజమౌళి ట్వీట్ దర్శనం ఇచ్చింది. ఈ విషయంపై ఎన్టీఆర్, మరియు చరణ్  ఫన్నీగా స్పందించారు. క్యాట్ గిఫ్ షేర్ చేసిన రామ్ చరణ్...సార్ అంటూ నిట్టూర్చగా, ఎన్టీఆర్ నవ్వుతున్న బ్రహ్మానందం గిఫ్ పెట్టారు.

రాజమౌళి తన ట్వీట్ లో మరో అరగంట వెయిట్ చేయాలని ట్వీట్ చేశారు. దీనితో ఎప్పటిలాగే రాజమౌళి ఈ సారి కూడా అనుకున్న సమయానికి రాలేకపోయారని అందరూ అనుకుంటున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేస్తుండగా ఆయనకు జంటగా శ్రీయా తక్కువ నిడివి కలిగిన పాత్రలో కనిపించనుంది. వచ్చే సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ విడుదల చేయాలని రాజమౌళి భావించారు. కోవిడ్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ విడుదల మరింత ఆలస్యం కానుంది.