యువ హీరో రాజ్ తరుణ్ కెరీర్ ఆరంభంలో యమ జోరుగా సాగింది. నటనలో రవితేజని తలపిస్తున్నాడంటూ ప్రశంసలు కూడా అందుకున్నాడు. కానీ కథల విషయంలో సెలెక్షన్ సరిగా లేకపోవడం వల్ల రాజ్ తరుణ్ కెరీర్ ప్రస్తుతం ఒడిదుడుకుల్లో ఉంది. రాజ్ తరుణ్ కు మేనేజర్ గా పనిచేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

తాను, రాజ్ తరుణ్ కలసి చేసిన కొన్ని పొరపాట్ల వల్ల సూపర్ హిట్ చిత్రాలు మిస్ అయ్యాయని రవీంద్ర తెలిపాడు. విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీ వాలా' చిత్రం కమర్షియల్ గా నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. సూపర్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రంలో నటించే అవకాశం మొదట రాజ్ తరుణ్ కే వచ్చింది. 

కేవలం కారు చుట్టూ తిరిగే కథ వర్కౌట్ కాదని నేను, రాజ్ తరుణ్ భావించాం. అందుకే ఆ చిత్రాన్ని అంగీకరించలేదు. ఇక శర్వానంద్ నటించిన 'శతమానం భవతి' చిత్రం కూడా మొదట రాజ్ తరుణ్ కే వచ్చింది. ఆ చిత్రం కూడా వర్కౌట్ కాదని అనుకున్నాం. కానీ మా అంచనా తప్పి ఆ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని రాజా రవీంద్ర వాపోయాడు. 

ఇక సుకుమార్ కథ అందించిన కుమారి 21 ఎఫ్ చిత్రాన్ని స్టోరీ వినకుండానే రాజ్ తరుణ్ ఓకె చేసాడట. ఆ చిత్రం విజయం సాధించింది. ఏ కథ సక్సెస్ అవుతుంది, ఏది ఫెయిల్ అవుతుంది అని అంచనా వేయడం చాలా కష్టం అని రాజా రవీంద్ర తెలిపాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఓ మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు.