కరోన సినీ పరిశ్రమను తీవ్ర స్థాయిలో దెబ్బ తీసింది. ఇప్పటికే కోట్ల రూపాయల నష్టం వాటిల్లగా ఇప్పటికీ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో అర్ధం కాని పరిస్థితి.  ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు ఇతర మార్గాల వైపు చూస్తున్నారు. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి లేకపోవటం. థియేటర్లు తెరుచుకున్నా.. ప్రజలు వస్తారా లేదా.. అన్న అనుమానాలు కూడా ఉండటంతో మీడియం రేంజ్‌ సినిమాల నిర్మాతలు ఓటీటీల వైపు చూస్తున్నారు.

వి లాంటి క్రేజీ సినిమానే ఓటీటీలో రిలీజ్ కావటంతో మరింత మంది దర్శక నిర్మాతలు అదే బాటలో నడించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా మరో యంగ్ హీరో కూడా తన సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టుగా ప్రకటించాడు. రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఒరేయ్‌ బుజ్జిగా. రాధమోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ద్వారా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీతో పాటు శాటిలైట్‌ రైట్స్‌ డీల్‌ కూడా పూర్తయ్యినట్టుగా తెలుస్తోంది. ఆహాలో అక్టోబర్‌ 2న ఈ మూవీ రిలీజ్ అవుతోంది. టీవీల్లో మాత్రం నవంబర్‌లో ప్రసారం చేసేలా అగ్రిమెంట్ జరిగిందట. రాజ్‌ తరుణ్‌ సరసన హెబ్బా పటేల్‌, మాళవిక నాయర్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనూప్‌ రుబెన్స్‌ సంగీతమందించాడు.