మంగళవారం తెల్లవారుజామున నార్సింగి వద్ద అల్కాపూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన తరువాత రాజ్ తరుణ్ కారు దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయినట్లు పోలీసులు సిసి టివి ఫుటేజ్ ద్వారా కనుగొన్నారు. 

ఈ విషయంపై అనేక రకాల అనుమానాలు వస్తుండడంతో రాజ్ తరుణ్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

"నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలని చాలా మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. నేను క్షేమంగా ఉన్నానా లేదా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. నా క్షేమం  కోసం ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను సురక్షితంగా ఉన్నాను. నేను ప్రయాణిస్తున్నప్పుడు ఊహించని విధంగా ఓ మలుపు దగ్గర కుడివైపుకు తిరగాల్సి వచ్చింది. దాంతో కారు రోడ్డు పక్కన ఉన్న గోడను డీ కొట్టింది. ఆ సౌండ్ కి వెంటనే నా చెవులు బ్లాక్ అయ్యాయి. ఏమి అర్ధం కాలేదు. సీటు బెల్టు పెట్టుకోవడంతో నేను క్షేమంగా బయటపడ్డాను. 

సహాయంకోసం వెంటనే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ జరిగింది ఇదే. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాను" అంటూ త్వరలో మళ్ళీ షూటింగ్ కి వెళ్లనున్నట్లు రాజ్ తరుణ్ వివరణ ఇచ్చారు. 

ఇక రాజ్ తరుణ్ పై ర్యాష్‌ డ్రైవింగ్‌, పబ్లిక్‌ న్యూసెన్స్‌ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రాజ్ తరుణ్ నడిపిన కారు యజమానిని విచారించి ఆ తరువాత అతను ఇచ్చిన వివరణను బట్టి రాజ్ తరుణ్ ని పోలీసులు విచారించే అవకాశం ఉంది.