విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా యంగ్ డైరెక్టర్ భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. భారీ అంచనాల మధ్య మొన్న శుక్రవారం (జులై 26న) విడుదలైన ఈ సినిమా మార్నింగ్ షో  నుండి డివైడ్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు టాక్ ఎలా ఉన్నా... మంచి వసూళ్లు దక్కాయి.  అయితే ఆ తర్వాత మల్టిప్లెక్స్ లలో బాగానే ఉన్నా... చాలా సెంటర్లలో డ్రాప్ స్టార్టైంది. ముఖ్యంగా సీడెడ్ లో పరిస్దితి మరీ స్పష్టంగా కనపడిపోయింది.

దాంతో రివ్యూల నుంచి, సినిమా చూసిన ప్రేక్షకులు నుండి కొంత లాగ్ ఉందని ఫీడ్ బ్యాక్ తీసుకున్న దర్శక నిర్మాతలు దానికి తగ్గట్లు కొన్ని చర్యలు తీసుకున్నారు. 13 నిముషాలు ట్రిమ్ చేసారు. క్యాంటిన్ సాంగ్ ని సైతం కలిపారు. అయితే సినిమా పికప్ అయ్యిందో లేదో కానీ వర్షాల వల్ల కలెక్షన్స్ పై ప్రభావం  పడిందని మాత్రం నిర్మాతలు అన్నారు. 

నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్‌మాట్లాడుతూ.. ‘‘'డియర్ కామ్రేడ్' సినిమా రైట్స్‌ను రూ. 27 కోట్లకి అమ్మాం.  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.21 కోట్ల షేర్‌ వచ్చింది.  దీంతో పంపిణీదారులకి 80 శాతం రికవరీ కూడా అయ్యింది. అంతేకాదు మరో మూడు నాలుగు రోజుల్లో వంద శాతం రికవరి వస్తుంది.. అయితే కొన్నిచోట్ల వర్షాలు సినిమాపై ప్రభావం చూపించాయని.. దీంతో కాస్తా వసూళ్లు తగ్గాయని తెలిపారు.

మరొక నిర్మాత మోహన్‌ చెరుకూరి మాట్లాడుతూ..‘‘తొలి రోజు సినిమా చూశాక కాస్త స్లోగా సాగుతోందన్నారు. దీంతో మేం వెంటనే స్పందించి 13 నిమిషాల వరకు సినిమా లెంగ్త్ ని తగ్గించాం. అంతేకాకుండా ప్రేక్షకుల కోరిక మేరకు అదనంగా క్యాంటీన్‌ సాంగ్‌ను కూడా కలిపాం . ఇక నుంచి  ప్రేక్షకులకు మా కామ్రేడ్‌ మరింతగా నచ్చేస్తాడని చెప్పారు.