ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి 'మీటూ' ఉద్యమంలో భాగంగా తనవంతుగా పోరాడుతోంది. సినిమా ఇండస్ట్రీలో మహిళలపై జరిగే అరాచకాలను ప్రశ్నిస్తూ తన గొంతు వినిపిస్తోంది. అయితే కొద్దిరోజుల క్రితం ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టింది.

సీనియర్ హీరోలు తమకంటే సగం వయసున్న అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్నారంటూ ఘాటుగా స్పందించింది. అదయితే ఇప్పుడు ఆమె భర్త రాహుల్ రవీంద్రన్.. నాగార్జున హీరోగా 'మన్మథుడు 2' సినిమాను రూపొందించాడు. 

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో నాగార్జున లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోయాడు. తనకంటే చిన్న వాళ్లైన హీరోయిన్లతో నాగార్జున రొమాన్స్ చేయడంతో నెటిజన్లు చిన్మయిని టార్గెట్ చేశారు. చిన్మయి చేసే పోరాటానికి, 'మన్మథుడు 2' సినిమాతో ముడిపెట్టి ఆమెని విమర్శించారు. తన భార్యపై జరుగుతోన్న ట్రోలింగ్ పై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పెదవి విప్పాడు.

తన భార్య, తను మహిళలపై జరిగే అఘాయిత్యాల పోరాడుతున్నామని, దానికి తాము ఎప్పుడూ వ్యతిరేకమే అని స్పష్టం చేశాడు. అంత మాత్రాన తాను శృంగారానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశాడు. ఇష్టపూర్వకంగా చేసే రొమాన్స్ వేరు, బలవంతంగా అనుభవించడం వేరని అన్నాడు. రొమాన్స్ అందరి జీవితాల్లో భాగమని, దానికి మీద సినిమా తీయడంతో తప్పేముందని ప్రశ్నించాడు. తన భార్య పోరాటానికి, తాను తీస్తోన్న సినిమాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.