బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రాహుల్ మహాజన్ ఇప్పటికే రెండు పెళ్లిల్లు చేసుకొని తన భార్యల నుండి విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు అతడు కజకస్తాన్ మోడల్ నటాల్య ఇలినాను మూడో వివాహం చేసుకున్నాడు. వివాదాలతో వార్తల్లో నిలిచే మహాజన్ మూడో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గతంలో పైలట్ శ్వేతా సింగ్, టీవీ నటి డింపీ గంగూలిని ఆయన పెళ్లి చేసుకొని విడిపోయారు. గృహ హింస కారణంగా మహాజన్ ఇద్దరి భార్యలు ఆయనకీ దూరమయ్యారు. తన చిన్ననాటి స్నేహితురాలు శ్వేతా సింగ్ ని 2007లో వివాహం చేసుకోగా ఆమెని శారీరకంగా హింసిస్తున్నాడని పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంది.

ఆ తరువాత 2010లో ఓ రియాలిటీ షోలో డింపీ గంగూలిని రాహుల్ మహాజన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల తరువాత డింపీ కూడా అతడిపై గృహహింస కేసు పెట్టి అతడికి దూరమైంది. విడిపోయే ముందు రాహుల్ తనను బాగా కొట్టేవాడని డింపీ వెల్లడించింది. ఇప్పుడు అతడు మూడో పెళ్లి చేసుకోవడంపై డింపీ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

''రాహుల్ మూడో పెళ్లి వార్త వినగానే మొదట నాకు నవ్వొచ్చింది. ఇలినా గృహ హింస బారిన పడకూడదని కోరుకుంటున్నాను. రాహుల్ చాలా మారిపోయి ఉంటాడని అనుకుంటున్నాను. వారిద్దరూ ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అంటూ వెల్లడించింది.