దక్షిణాది అగ్ర దర్శకుడు మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' అనే సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన చారిత్రక నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

ఈ  సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో పన్నెండు పాటలకు వైరముత్తు సాహిత్యం అందిస్తున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయంపై అభిమానులు సోషల్ మీడియా వేదికంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో వైరముత్తు 'మీటూ' ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సింగర్ చిన్మయితో పాటు మరికొంతమంది మహిళలు వైరముత్తు కారణంగా ఎదుర్కొన్న చేదు సంఘటలను బయటపెట్టారు. అలాంటి వ్యక్తిని 'పొన్నియిన్ సెల్వన్' వంటి సినిమాలో ఎలా తీసుకుంటారని అభిమానులు మణిరత్నంని ప్రశ్నిస్తున్నారు.

అతడి సినిమాను తప్పించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. వైరముత్తు ఉన్న ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోమని ఏఆర్ రెహ్మాన్ ని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. విక్రమ్, జయం రవి, అమితాబ్‌బచ్చన్, ఐశ్వర్యరాయ్, మోహన్‌బాబు వంటి వివిధ భాషల అగ్రతారలను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు.