దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టి అమలు చేశారు. మే 4 దర్శకుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసారు. ఈ ట్రస్ట్ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దర్శకుల కుటుంబాలకు సాయం అందిస్తారు. విద్య, వైద్యం లాంటి అవసరాలకు ఆదుకునే మంచి ఆలోచన. 

రాఘవేంద్రరావు ఆలోచన మెచ్చిన పలువురు ప్రముఖులు ఈ ట్రస్ట్ కు తమకు తోచిన విధంగా విరాళాలు అందిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి 50 లక్షల భారీ విరాళం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి 25 లక్షలు, ఆర్కా మీడియా సంస్థ 15 లక్షలు, రాఘవేంద్ర రావు 10 లక్షల విరాళాన్ని ఈ ట్రస్ట్ కు ప్రకటించారు. 

తెలుగు ఫిలిం డైరెక్టర్స్ ట్రస్ట్ పేరుతో బుధవారం రోజు ఈ ట్రస్ట్ ని అధికారికంగా రిజిస్టర్ చేశారు. ఈ ట్రస్ట్ కు రాఘవేంద్ర రావు చైర్మన్ గా ఉంటారు. దర్శకుడు ఎన్ శంకర్, వివి వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, వంశి పైడిపల్లి, కొరటాల శివ, నందిని రెడ్డి లాంటి ప్రముఖ దర్శకులంతా ట్రస్టీలుగా నియమితులయ్యారు.