ఎన్టీఆర్ బయోపిక్ ఎపిసోడ్ లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బాలయ్య నటిస్తూ - నిర్మిస్తున్న ఎన్టీఆర్ సినిమా ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ తేజ తప్పుకున్నాడు. తేజ తానే తప్పుకున్నాడా.. లేక తప్పించారా అనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. తేజ తప్పుకున్న విషయం మాత్రం మీడియాలో వైరల్ అయింది. ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఎలా చూపించాలన్నదాని పై బాలయ్య - తేజ మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. తేజ కాకుండా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను ఎవరు డీల్ చేయబోతున్నారు అనేది కూడా సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. తేజ తప్పుకోవడం అనూహ్య పరిణామమని అంటున్నారు.‘‘ఎన్టీఆర్‌ లాంటి మహా వ్యక్తి చరిత్రను తెరకెక్కించలేనేమో అనే భయంతోనే ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటున్నాను’’ అని దర్శకుడు తేజ చెప్పినట్లుగా సినిమా పి.ఆర్‌.వో తెలిపారు.

ఇప్పుడు ఈ సినిమాపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. కొంతమంది ఇప్పుడు ఈ సినిమాని రాఘవేంద్రరావు దర్శకత్వం భాద్యతలు పుచ్చుకుంటున్నారని ఒక ప్రచారం. మరోవైపు బాలయ్యే ఈ సినిమాకి సింగీతం శ్రీనివాస్ పర్యవేక్షణలో దర్శకత్వం చేయబోతున్నాడని మరో ప్రచారం జరుగుతుంది. మరి ఈ చిత్రం దర్శకత్వ పగ్గాలు ఎవరు తీసుకుంటారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.