సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ సినిమా 'మహర్షి' మే 9న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అయితే సినిమా ప్రమోషన్స్ లో 'మహర్షి' కంటే తన పాతిక సినిమాల జర్నీ గురించే మహేష్ ఎక్కువగా మాట్లాడుతున్నాడు.

ఈ క్రమంలో తన తొలి సినిమా అనుభవాల్ని పంచుకున్నారు. రాజకుమారుడు సినిమా నేరేషన్ జరుగుతున్న సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు తనపై సీరియస్ అయిన విషయాన్ని వెల్లడించాడు మహేష్. ఆ సమయంలో పరుచూరి బ్రదర్స్ వచ్చి కథ చెబుతున్నప్పుడు రాఘవేంద్రరావు గారి టేబుల్ పైన రబ్బర్ బ్యాండ్ ఒకటుంటే.. ఆ కథ వింటూ ఆ రబ్బర్ బ్యాండ్ తో ఆడుకుంటున్నాడట మహేష్.

మొత్తం నేరేషన్ అయిన తరువాత పరుచూరి బ్రదర్స్ వెళ్లిపోయారట. అప్పుడు రాఘవేంద్రరావు గారు మహేష్ బిహేవియర్ చూసి ఆయనపై ఫైర్ అయ్యారట. కథ నచ్చినా, నచ్చకపోయినా నచ్చినట్లు బిహేవ్ చేయాలని, రబ్బర్ బ్యాండ్ తో ఆడుకుంటే దర్శకుల కాన్ఫిడెన్స్ పోతుందని, భవిష్యత్తులో ఇలా చేయకని క్లాస్ పీకారట.

ఆ సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెబుతున్నాడు మహేష్. చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకు అప్పటికే అనుభవం ఉన్నప్పటికీ హీరో అనేసరికి చాలా ఇబ్బందిపడినట్లు ఆ సమయంలో రాఘవేంద్రరావు తనకు అన్నీ నేర్పించారని గుర్తు చేసుకున్నాడు.