ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం  ‘రాధే శ్యామ్‌’ . ఈ చిత్రం షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయిందని సమాచారం. లాక్‌డౌన్‌ ముందు వారమే జార్జియాలో ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని వచ్చింది చిత్రం టీమ్. ఆ తర్వాత కరోనా ప్రభావంతో షూటింగ్ ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. కానీ తాజాగా ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుందని వార్తలు మీడియాలో వస్తున్నాయి. వాటిని ఖరారు చేస్తూ ఫ్యాన్స్ కు ఆనందపరిచేలా దర్శకుడు రాధాకృష్ణ అప్ డేట్ ఇచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం... సెప్టెంబర్ 2 వ వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ షూటింగ్ చాలా పెద్ద షెడ్యూల్ అని, లవ్ లీగా ఉండబోతుందని హింట్ ఇచ్చారు. 

 ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్‌ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో షూట్‌ చేయడం ఇబ్బందే అని హైదరాబాద్‌లోనే వీలైనంత భాగాన్ని సెట్స్‌ వేసి చిత్రీకరించనున్నారని తెలిసింది. సెప్టెంబర్ 2 వ వారం నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. 

ఈ ఏడాది చివరి కల్లా ఈ సినిమాను పూర్తి చేయాలన్నది ప్లాన్‌. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది నెలాఖరులోగా పూర్తి చేసి.. వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలని చూస్తోందట చిత్ర యూనిట్. కాగా, ప్రభాస్ ఈ లాక్ డౌన్ టైంలో ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్‌తో ఓ చిత్రం, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్‌తో ఓ చిత్రాన్ని చేయనున్నారు.

`బాహుబలి` తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం `సాహో`. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అభిమానులను నిరాశపరిచింది. దాంతో తదుపరి సినిమాతో ఎలాగైనా ప్రభాస్ సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో సినిమాకు సంభందించిన ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు.