ధనుష్ హీరోగా నటించిన `సార్` మూవీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం `సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనికి గెస్ట్ గా వచ్చిన ఆర్ నారాయణ మూర్తి చిత్ర దర్శకుడికి పెద్ద షాక్ ఇచ్చారు.
`సార్` మూవీ డైరెక్టర్ వెంకీ అట్లూరికి పెద్ద షాక్ ఇచ్చాడు దర్శక, నటుడు, నిర్మాత ఆర్ నారాయణ మూర్తి. సినిమా క్లైమాక్స్ విషయంలో తాను సాటిస్పై కాలేదని తెలిపారు. ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా విషయాన్ని చెబుతారని, కానీ వెంకీ అట్లూరి క్లైమాక్స్ లో విలన్ ఎపిసోడ్ తీసిన విధానంలో తాను సంతృప్తి చెందలేదన్నారు. విలన్ అహాంకారాన్ని అంతం చేసేలా సీన్ చేశాడని, కానీ తాను అలా చేయనని తెలిపారు. అదే తనకు తృప్తిగా అనిపించలేదన్నారు ఆర్ నారాయణ మూర్తి.
ఇదిలా ఉంటే `సార్` సినిమా కాన్సెప్ట్, తాను తీయబోతున్న `యూనివర్సిటీ` మూవీ కాన్సెప్ట్ సేమ్ అని, ఈ సినిమా వస్తుందని చెప్పినప్పుడు చాలా టెన్షన్ పడ్డానన్నాడు. ఈ డైరెక్టర్ తనకు దెబ్బ కొట్టబోతున్నాడా అనే భయంతో సినిమా చూశానని, కానీ సినిమా అయ్యాక ఊపిరి పీల్చుకున్నానన్నారు. పేపర్ లీకేజీ విషయాన్ని టచ్ చేయలేదని, దీంతో తాను బయటపడిపోయానని చెప్పారు. తాను విద్య, వైద్యం ప్రైవేటీకరణ కావద్దని, దీనిపై పార్లమెంట్ లో బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో తాను సినిమా తీస్తున్నట్టు చెప్పారు ఆర్ నారాయణ మూర్తి. సోమవారం సాయంత్రం `సార్` సక్సెస్ మీట్‌కి అతిథిగా వచ్చిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంకా ఆయన చెబుతూ, `గుండెలకు హత్తుకునేలా సినిమా ఉంటే సూపర్ హిట్ చేస్తామని మరోసారి ప్రేక్షకులు నిరూపించారు. ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడికి నా అభినందనలు. ఇలాంటి సినిమాలు తీయడం ఆశామాషి కాదు. దానికి గుండె ధైర్యం కావాలి. ఇది ఆర్ట్ ఫిల్మ్ కాదు.. కానీ ఆర్ట్ ఫిల్మే. ఇది కమర్షియల్ సినిమా కాదు.. కానీ కమర్షియల్ సినిమానే. అలా మాయ చేశాడు దర్శకుడు. ఇది ప్రజల సినిమా, స్టూడెంట్స్ సినిమా, పేరెంట్స్ సినిమా. జీవితంలో గుర్తుండిపోయే ఇలాంటి సినిమా తీసి హిట్ కొట్టిన నిర్మాతకు నా అభినందనలు. హాలీవుడ్ యాక్టర్ సిడ్నీ పోయిటియర్ నటించిన 'టు సర్, విత్ లవ్', ఎన్టీ రామారావు గారి 'బడిపంతులు', హృతిక్ రోషన్ నటించిన 'సూపర్ 30' లాగా ఇది కూడా సూపర్ డూపర్ హిట్.
ఈ సినిమా గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. విద్య, వైద్యం అనేవి ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని రాజ్యాంగ మనకు కల్పించిన హక్కు. కానీ అవి వ్యాపారం అయిపోయాయి. విద్య, వైద్యం వ్యాపారం కాకూడదు. పేదలందరికీ విద్య అందుబాటులో ఉండాలి.. ప్రైవేట్ సెక్టార్ వద్దు, పబ్లిక్ సెక్టార్ ముద్దు అనే సందేశాన్ని చాటి చెప్పిన ఈ చిత్రానికి హ్యాట్సాఫ్. దర్శకుడు సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించాయి. ప్రతి పాత్రను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. సంయుక్తమీనన్, సాయి కుమార్, సముద్రఖని, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది అందరూ అద్భుతంగా నటించారు. కెమెరామెన్ 90ల బ్యాక్ డ్రాప్ ని చక్కగా చూపించారు. ధనుష్ గారు గొప్ప నటుడు. సహజంగా నటిస్తారు. భాషతో సంబంధం లేకుండా అందరికీ దగ్గరైన నటుడు. ఆయన నటనకు సెల్యూట్` అని తెలిపారు ఆర్ నారాయణ మూర్తి.

నటుడు సుమంత్ మాట్లాడుతూ, `ఇంత మంచి పాత్ర రాసి, ఆ పాత్రకు నేను న్యాయం చేస్తానని నమ్మిన దర్శకుడు వెంకీకి థాంక్స్. తక్కువ రోజులే పనిచేసిన ఈ సినిమాలో భాగం కావడం ఆనందాన్ని ఇచ్చింది. నాకొక అలవాటు ఉంది. పాత్ర చిన్నదైనా పెద్దదైనా స్క్రిప్ట్ మొత్తం చదవడం అలవాటు. చదవగానే ఈ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సబ్జెక్ట్ తీస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనిపించింది. ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించింది. ఈ స్థాయిలో వసూళ్ళు రావడం సంతోషంగా ఉంది` అని చెప్పారు.
ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ కథానాయికగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం `సార్`. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్య్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవరనాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం(ఫిబ్రవరి 17)న ఈ చిత్రం విడుదలైంది. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌తో రన్ అవుతుంది. మూడు రోజుల్లో ఇది 51కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో సముద్రఖని, సంయుక్త మీనన్, సాయికుమార్, హైపర్ ఆదితోపాటు ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి టీమ్‌లోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
