కుడి ఎడమైంది. అప్పుడు హిట్ అయిన మగధీర ప్లాప్ కాగా, ప్లాప్ అయిన ఆరంజ్ హిట్ కొట్టింది. ఆ కథ ఏమిటో చూద్దాం...
టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ప్రత్యేక సందర్భాల్లో స్టార్ హీరోల పాత చిత్రాలు మరలా విడుదల చేస్తున్నారు. ఖుషి, జల్సా, ఒక్కడు, సింహాద్రి వంటి చిత్రాలు రీ రిలీజ్ చేయగా, మంచి వసూళ్లు సాధించాయి. గత రెండేళ్లలో అనేక చిత్రాలు మరలా విడుదల చేయడం జరిగింది. రామ్ చరణ్ బర్త్ డే కానుకగా గత ఏడాది ఆరెంజ్ రీ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి భారీ స్పందన దక్కింది. నిజానికి 2010లో విడుదలైన ఆరెంజ్ భారీ డిజాస్టర్. నిర్మాత నాగబాబును అప్పుల కూపంలోకి నెట్టేసింది.
సర్వం కోల్పోయిన నాగబాబు కోలుకోవడానికి ఏళ్ల సమయం పట్టింది. బొమ్మరిల్లు భాస్కర్ ఆరెంజ్ సినిమాకు దర్శకత్వం వహించాడు. దాదాపు సినిమా మొత్తం ఆస్ట్రేలియాలో షూట్ చేశారు. బడ్జెట్ పెరగడంతో పాటు సినిమా ప్లాప్ కావడంతో పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. అయితే రీరిలీజ్ లో సత్తా చాటిన ఆరెంజ్ వరల్డ్ వైడ్ రూ. 3 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. రూ. 1.05 షేర్ వసూలు చేసింది.
ఆరెంజ్ రీ రిలీజ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్లు నాగబాబు ప్రకటించారు. అది కూడా ఆరెంజ్ సినిమాకు భారీ వసూళ్లు దక్కడానికి కారణం అయ్యింది. ఆరెంజ్ రీరిలీజ్ వసూళ్ళు నాగబాబు అనంతరం పవన్ కళ్యాణ్ కి అందజేశారు. కాగా మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే కాగా మగధీర రీరిలీజ్ చేశారు.
మగధీర చిత్రానికి కనీస స్పందన రాలేదు. మగధీర చిత్ర వసూళ్లు లక్షలకే పరిమితం అయ్యాయి. కొన్ని చోట్ల షోలు క్యాన్సిల్ చేశారు. మగధీర చిత్రానికి చెప్పుకోదగ్గ పోటీ కూడా లేదు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో మగధీర రీ రిలీజ్ డిజాస్టర్ అయ్యింది. 2009లో విడుదలైన మగధీర ఇండస్ట్రీ హిట్. వందకోట్లకు పైగా వసూళ్లతో టాలీవుడ్ రికార్డ్స్ మొత్తం చెరిపేసింది. రామ్ చరణ్ రెండో చిత్రంగా విడుదలైన ఈ మూవీకి రాజమౌళి దర్శకుడు. కానీ రీ రిలీజ్ లో బోల్తా పడింది. డిజాస్టర్ అయిన ఆరెంజ్ మాత్రం భారీ వసూళ్లు రాబట్టింది.
