Asianet News TeluguAsianet News Telugu

#RamMandir వెండితెరపై అయోధ్య రాముడి వేడుక, రూ.100 మాత్రమే

రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న మధ్యాహ్నం 12:15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగుస్తుంది.
 

PVR INOX to Screen Ram Mandir Inauguration with Special Combo Offer jsp
Author
First Published Jan 20, 2024, 9:15 AM IST


 మరికొన్ని గంటల్లో  అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది.  సోమవారం (జనవరి 22) బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు దేశ విదేశాల్లోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు తరలి వెళ్తున్నారు. అలాగే ఈ మహాక్రతువును ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది అయోధ్యకు చేరుకుంటున్నారు. అదే సమయంలో చాలా మంది  టీవీల్లో చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా అయోధ్య రాముడి ఉత్సవాన్ని చూసే అవకాశం కల్పిస్తున్నాయి ప్రముఖ మల్టీప్లెక్స్‌ సంస్థలు పీవీఆర్‌, ఐనాక్స్‌. 

 కేవలం 100 రూపాయల టికెట్‌తోనే. దేశంలోని 70 ప్రధాన నగరాల్లోని 170 కంటే ఎక్కువ కేంద్రాల్లో అయోధ్య రాముడి పండగను ప్రత్యక్ష ప్రసారం చేసందుకు పీవీఆర్‌, ఐనాక్స్ ఏర్పాట్లు చేశాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బిగ్‌ స్క్రీన్‌పై ఈ మహాక్రతువును  చూడవచ్చు. దీనికి టికెట్ ధర 100 రూపాయలు మాత్రమే. ఇది సినిమా టిక్కెట్ ధర మాత్రమే కాదు, ఇందులో కూల్‌ డ్రింక్స్‌, పాప్‌కార్న్ కాంబో కూడా ఉంటుంది. 

గతంలో పీవీఆర్‌, ఐనాక్స్‌ లు వన్డే ప్రపంచ కప్‌ మ్యాచల్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ‘ఇదొక చారిత్రక ఘట్టం. అందుకే పెద్ద తెరపై చూసేందుకు అయోధ్య రాముడి ప్రారంభోత్సవాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని పీవీఆర్ ఐనాక్స్ కో-సీఈవో గౌతం దత్తా తెలిపారు. ఆయా మల్టీప్లెక్స్‌ల అధికారిక వెబ్‌ సైట్లలోనూ, అలాగే ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బుక్‌ మై షో లోనూ అయోధ్య రాముడి పండగ టికెట్లను ముందుగానే బుక్‌ చేసుకోవచ్చు. 

ఇక చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌ దంపతులు, మోహన్‌ బాబు, ప్రభాస్, రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, రిషబ్ శెట్టి, యష్, కంగనా రనౌత్, అలియా భట్ తదితర ప్రముఖులు అయోధ్య రాముడి వేడుకలో ప్రత్యక్షంగా భాగం కానున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వంటి ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. 

కార్యక్రమం జనవరి 22న మధ్యాహ్నం 12:15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios