Pushpa2: మెగాస్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్‌గా పుష్పరాజ్.. బ్యాక్ డ్రాప్ మారిందా?
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న `పుష్ప2` చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. `పుష్ప2`లో కథా నేపథ్యం, పుష్పరాజ్ తీరుతెన్నులు మార్చారట.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం `పుష్ప2`(Pushpa2) లో బిజీగా ఉన్నారు. `పుష్ప` చిత్రానికిగానూ జాతీయ ఉత్తమ నటుడిగా బన్నీ నేషనల్ అవార్డుకి ఎంపికైన నేపథ్యంలో ఈ చిత్రాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. పుష్పరాజ్ పాత్రని, కథ నేపథ్యాన్ని చాలా గ్రాండియర్‌గా ప్లాన్ చేస్తున్నారు. కథని మరింత పకట్బందీగా రాసుకున్నట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. `పుష్ప2`లో కథా నేపథ్యం, పుష్పరాజ్ తీరుతెన్నులు మార్చారట. `పుష్ప` కథ నేపథ్యం 1980-90 మధ్యలో సాగగా, రెండో పార్ట్ లో 2000లోకి మార్చారట. దీంతో పుష్పరాజ్ పాత్ర తీరుతెన్నులు కూడా మారినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.
`పుష్ప2`లో బన్నీ.. మెగాస్టార్ ఫ్యాన్‌గా కనిపించబోతున్నాని సమాచారం. 2000 `ఇంద్ర` టైమ్ రిలీజ్ టైమ్ కనిపిస్తుంది. ఆ సినిమా పోస్టర్లు సినిమాలో కనిపిస్తాయని, అంతేకాదు పలు సందర్బాల్లో పుష్పరాజ్ .. తాను మెగాస్టార్ ఫ్యాన్ అని చాటుకునే సన్నివేశాలుంటాయట. రియల్ లైఫ్‌లోనూ మెగాస్టార్(Chiranjeevi) కి బన్నీ అభిమాని అని తెలిసిందే. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే హీరోగా ఎదిగారు. ఈ విషయాన్ని ఆయనే ప్రతి సందర్భంలోనూ చెబుతుంటారు.
అలానే ఈ చిత్రంలోనూ పుష్పరాజ్‌గా చిరంజీవికి హార్డ్ కోర్ ఫ్యాన్‌గా కనిపిస్తారని, ఆయా సీన్లకి థియేటర్లలో ఈలలు పడేలా దర్శకుడు సుకుమార్ డిజైన్ చేస్తున్నట్టు, ప్రస్తుతం ఆయా సీన్లనే చిత్రీకరిస్తున్నారని సమాచారం. అయితే నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జాతీయ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఉంది. అందుకోసం సోమవారమే తన సతీసమేతంగా బన్నీ ఢిల్లీ చేరుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం హైదరాబాద్ వచ్చాక మళ్లీ `పుష్ప 2` చిత్రీకరణలో బన్నీ పాల్గొంటాడట.
ప్రస్తుతం `పుష్ప` టీమ్ మొత్తం ఢిల్లీలోనే ఉంది. `పుష్ప` చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడు(బన్నీ), బెస్ట్ మ్యూజిక్ విభాగంలో జాతీయ అవార్డులు వరించిన విషయం తెలిసిందే. `పుష్ప2` చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఫహద్ ఫాజిల్ విలన్‌రోల్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్టు టీమ్ ఇప్పటికే ప్రకటించింది.