కథకు ఎక్కడో చోట నుంచి ప్రేరణ తీసుకుంటూంటారు దర్శకులు. కొందరు వాస్తవిక సంఘటనలు నుంచి తీసుకుంటే, మరికొందరు తాము చదివిన సాహిత్యం నుంచి , ఇంకొందరు తాము చూసిన సినిమాల నుంచి ప్రేరణ పొందుతూంటారు. ప్రేరణ పొంది కథ రాయటం వేరు. యాజటీజ్ తెరెక్కించటం వేరు. అలాంటప్పుడు కాపీ కొట్టిన ముద్ర పడుతుంది.  తాజాగా పూరి, రామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి సైతం ఓ హాలీవుడ్ చిత్రం మూలముందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో  నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా కనపడనున్నారు. ఈ  చిత్రంలో మునుపెన్నడూ కనిపించని స్టైలిష్ లుక్‌లో రామ్ కనపడనున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఓ హాలీవుడ్ చిత్రం ప్రేరణగా రూపొందుతోందని సమాచారం. 

క్రిమినల్ అనే టైటిల్ తో  2016 వచ్చిన ఈ చిత్రంలో  ఓ సీఐఎ ఏజెంట్  ఓ హ్యాకర్ ని పట్టుకోవటం కోసం ప్రయత్నిస్తూంటాడు. ఆ ప్రయత్నంలో అతను చనిపోతాడు. అప్పుడు అతని మెమరీస్ ని ఓ క్రిమినల్ ట్రాన్సఫర్ చేస్తారు. అప్పుడు ఆ క్రిమినల్ ..ఈ సీఐఎ ఏజెంట్ జ్ఞాపకాలతో మేల్కొంటాడు. అప్పుడు అతని లక్ష్యం ఒకటే ఆ హ్యాకర్ ని పట్టుకోవటం. ఆ హ్యాకర్ ని పట్టుకోకపోతే మూడో ప్రపంచ యుద్దానికి దారి తీసే పరిస్దితి ఉంటుంది. అప్పుడు ఓ సీఐఎ ఏజెంట్ గా మారిన ఆ క్రిమినల్ ..అ హ్యాకర్ ని ఎలా పట్టుకున్నాడు..ఆ క్రమంలో చాలా ఏక్షన్ ఎపిసోడ్స్ చోటు చేసుకుంటాయి. 

రేపటి నుంచి వారణాసిలో భారీ యాక్షన్ షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ చిత్రంలో హైలైట్‌గా నిలిచే భారీ యాక్షన్స్ సీన్స్ తెరకెక్కించేందుకు వారణాసి లొకేషన్ ఎంపిక చేసుకున్న చిత్రయూనిట్ ఫ్లైట్‌లో వారణాసి ప్రయణమయ్యారు. ఈ మేరకు చిత్రయూనిట్ సభ్యులు ప్రత్యేకంగా ఓ ఫ్లైట్ బుక్ చేసుకోవడం విశేషం. ఈ ఎపిసోడ్‌లో హీరో రామ్, హీరోయిన్ నిధి అగర్వాల్, ఇతర నటీనటులు ఆశిష్ విద్యార్ధి, సాయాజీ షైన్, దీపక్ శెట్టి, తులసి పాల్గొననున్నారు. సతీష్ మాస్టర్ కొరియోగ్రఫీలో పూరి జగన్నాధ్ స్టైల్ ఆఫ్ టేకింగ్‌లో భారీ హంగులతో ఈ ఫైట్ సీన్స్ తెరకెక్కనున్నాయి. ఈ వేసవి లో ప్రేక్షకులను అలరించేందుకు ‘ఇస్మార్ట్ శంకర్’ టీమ్ రెడీ అవుతోంది.