గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో 'పోకిరి','బిజినెస్ మెన్' సినిమాలు తీశాడు. ఆ రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే మహేష్ తో మరో సినిమా చేయాలనుకున్నాడు పూరి.దానికి 'జనగణమన' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. మహేష్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ కూడా చేశాడు. కానీ తర్వాత రకకరకాల కారణాలతో ఈ సినిమా ఊసే లేకుండా పోయింది. పూరి మాత్రం ఎప్పటికైనా ఈ సినిమా చేస్తానని అంటున్నారు. ఇప్పుడు చేస్తానని ఖరారు చేసారు. అయితే మహేష్ తో మాత్రం కాదని తేలిపోయింది.  

అందుతున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ తన తదుపరి ప్రాజెక్టుగా జనగణమన చిత్రాన్ని చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. అందుకోసం రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఓ స్టార్ హీరో ని తీసుకువచ్చి తనే సొంతంగా సినిమా నిర్మించాలనుకుంటున్నారు. ఈ మేరకు హీరోలను కలిసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

 స్క్రిప్టు నచ్చితే లాభాల్లో షేర్ క్రింద హీరోని ఒప్పించాలనుకుంటున్నారట. ఇస్మార్ట్ శంకర్ హిట్ ఇచ్చిన కిక్ తో ఆయన ఈ ప్రయత్నం చేయబోతున్నట్లు సమాచారం. వంద కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు స్క్రిప్టు ఎప్పుడో రెడీ అయినట్లు చెప్తున్నారు. 2020లో ఎట్టి పరిస్దితుల్లోనూ ఈ సినిమాని పట్టాలు ఎక్కిస్తానంటున్నారు. 
 
అయితే ఏ హీరోతో ఆయన ముందుకు వెళ్లబోతున్నారనేది ఇప్పటికీ ఆయనకీ తెలియదు. అలాగే ఓ పెద్ద రాజకీయనాయకుడు ఆయనకు ఈ విషయంలో వెనక నుంచి ఫైనాన్స్ పరంగా సపోర్ట్ చేయబోతున్నారట. దాంతో బడ్జెట్ పరంగానూ వెనకాడేది లేదని అంటున్నారు. వర్మ కూడా ఈ సినిమా విషయంలో సాయం చేయబోతున్నారట. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రెడీ కానుంది.