మహేష్ బాబు హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో పోకిరి, బిజినెస్ మెన్ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారు. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. కానీ ఇప్పుడు పూరి మహేష్ తో కాకపోతే ఏంటి మరో హీరోతో సినిమా చేస్తా అంటున్నాడు. అసలు విషయంలోకి వస్తే.. మహేష్ బాబు కోసం పూరి జగన్నాథ్ 'జనగణమన' అనే కథను సిద్ధం చేశాడు. ఈ సినిమా చేయాలని ప్లాన్ కూడా చేశాడు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. దీంతో మహేష్ కూడా సినిమా చేయడానికి అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ ఊసేత్తేవారే లేరు.

తాజాగా మీడియా ముందుకు వచ్చిన పూరి జగన్నాథ్ ను ఇదే విషయమై ప్రశ్నించగా.. ''మహేష్ కు కథ వినిపించిన మాట వాస్తవమే.. కానీ ఆయన తన అభిప్రాయాన్ని చెప్పలేదు. ఈ సినిమా మహేష్ బాబు చేయకపోతే మరో హీరోతో అయినా చేసి తీరతా.. ప్రస్తుతం సమాజంలో ఎటు చూసిన అత్యాచారాలు,హత్యలు ఇవే కనిపిస్తున్నాయి. మహిళలకు భద్రత లేకపోవడం భాధాకరం. అసలు ఈ దేశం ఎటు వెళ్తుందో అర్ధం కావడం లేదు. ఈ దేశాన్ని మార్చడం కోసం ఏం చేయాలనేదే  జనగణమన సినిమా' అని వెల్లడించారు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'మెహబూబా' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తన కొడుకు ఆకాష్ పూరి నటించిన ఈ చిత్రంతో తనకు మంచి విజయం అందుతుందనే నమ్మకంతో ఉన్నాడు పూరి. తన తదుపరి సినిమా కూడా ఆకాష్ తో చేసే ఛాన్స్ ఉంది. మరి జనగణమన సినిమా ఎప్పుడు చేస్తాడో చూడాలి!