మహేష్ బాబు జనగణమన చిత్రాన్ని రిజెక్ట్ చేయడంతో పూరి కొంతకాలం ఆ కథని పక్కన పెట్టేశాడు. ఎప్పటికైనా భారీ స్థాయిలో ఆ చిత్రాన్ని తెరకెక్కించాలనేది పూరి ప్లాన్. చాలా రోజుల తర్వాత పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడిగా పూరిని మళ్లీ నిలబెట్టిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. 

దీనితో మరో మారు పూరి జగన్నాధ్ కు మంచి డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం పూరి జగన్నాధ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ఓ చిత్రం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇదిలా ఉండగానే పూరి జగన్నాధ్ జనగణమన చిత్రానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. 

కొన్ని రోజుల క్రితం పూరి జగన్నాధ్ కెజిఎఫ్ హీరో యష్ కు జనగణమన కథ వినిపించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మరో వార్త ప్రచారం జరుగుతోంది. రెండు బాహుబలి రెండు భాగాలు, సాహో చిత్రంతో ఇప్పటివరకు ప్రభాస్ తీరికలేకుండా గడిపాడు. ఆ చిత్రాలు కంప్లీట్ కావడంతో పూరి జగన్నాధ్ ప్రభాస్ కు జనగణమన కథ వినిపించాడని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. 

ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తిగానే ఉన్నాడట. దీనితో ప్రభాస్ ని ఎలాగైనా ఒప్పించేందుకు పూరి జగన్నాధ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూరి, ప్రభాస్ కాంబోలో ఇప్పటికే బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ చిత్రాలు వచ్చాయి. ఆ రెండు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.