స్టార్ కమెడియన్ అలీ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించాడు. హీరోగా సక్సెస్ సాధించినా కామెడీ రోల్స్ ని వదిలిపెట్టలేదు. తాజాగా అలీ హీరోగా నటించిన చిత్రం 'పండుగాడి ఫోటో స్టూడియో'. ఆగష్టు 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. 

ఈ వేడుకకు పూరి జగన్నాధ్, బోయపాటి శ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎప్పటిలానే దర్శకుడు పూరి తన సరదా ప్రసంగంతో ఆకట్టుకున్నారు. అలీ గురించి ఆసక్తికర విషయాలని పంచుకున్నారు. తన సినిమా విజయం సాధించి సంతోషంలో ఉన్నా, పరాజయం చెంది నిరాశలో ఉన్నా అలీ ఒక్కడే పిలవకుండా వస్తాడని పూరి అన్నారు. 

సినిమా హిట్టయితే ఓ హగ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోతాడు. సినిమా ఫ్లాపై నిరాశలో ఉంటే ఓ పెగ్ తనకు పోసి ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు. తమ కాంబినేషన్లో చాలా చిత్రాలు వచ్చాయి. అలీ చేసిన పాత్రలు బాగా పాపులర్ అయ్యాయని పూరి గుర్తుచేసుకున్నారు. 

నా జీవితంలో కొన్ని గ్యాంబ్లింగ్స్ జరిగి ఆస్తులు పోగొట్టుకున్నా. చివరకు ఆఫీస్ కూడా అమ్మేసి వెళ్లిపోతుంటే అలీ పలకరించడానికి వచ్చాడు. అమ్మవారి దగ్గర పూజ చేసిన చిన్న విగ్రహాన్ని నాకు ఇచ్చాడు. దీనిని మెడలో వేసుకో భయ్యా అని అన్నాడు. దేవుడిపై నమ్మకం లేకుంటే కనీసం జేబులో పెట్టుకుని అయినా తిరుగు.. దెబ్బతో పోయిన నీ ఆస్తులన్నీ తిరిగొస్తాయి అని చెప్పాడు. అలీ ఆ మాట చెప్పిన రెండేళ్లకు తన ఆస్తులు మొత్తం తిరిగొచ్చాయని పూరి ఆడియో వేడుకలో తెలిపారు.