ఇక విజయ్ దేవరకొండతో చాలు..మళ్ళీ రామ్ వైపు చూస్తున్నాడు మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. నెక్ట్స్ మూవీ కూడా విజయ్ దేవరకొండతోనే ప్లాన్ చేసుకున్న మాస్ డైరెక్టర్.. ఇప్పుడు నిర్ణయం మార్చుకోక తప్పలేదు.  

పాపం పూరీ జగన్నాథ్.. అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి. ఇండస్ట్రీ హిట్ అవుతుందనుకున్న లైగర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లాపడటంతో..పూరీ బాధ వర్ణనాతీతం. ఎలాగో లైగర్ హిట్ అవుతుంది.. కాబట్టి నెక్ట్స్ సినిమా కూడా రచ్చ చేయవచ్చు అనుకున్నారో ఏమో..లైగర్ రిలీజ్ కు ముందే విజయ్ తో జనగణమన ప్రకటించేశాడు పూరీ. కాని ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కే పరిస్థితి లేదు. దాంతో పూరీ మనసు మార్చుకున్నారట.

పూరి జగన్నాథ్ ను లైగర్ ఆదుకోలేక పోయింది. పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో ఆ తరువాత ఆయన చేయనున్న జన గణ మన ప్రాజెక్టును ప్రస్తుతానికి ఆపేసే ఆలోచనలో పూరీ జగన్నాథ్ ఉన్నట్టుగా ఒక టాక్ నడుస్తోంది. అందులోను జనగణమన సినిమాకు భారీ బడ్జెట్ అవసరం ఉంది. లైగర్ ఫెయిల్యూర్ తో.. పూరీని నమ్మి ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రావడంలేదు. ఇప్పటికే 20 కోట్లు ప్రీ ప్రొడక్షన్ కు ఖర్చు అవ్వగా.. ఇప్పటికే ఉన్న నిర్మాతలు కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. 

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈసినిమాకు ఇంత బడ్జెట్ పెట్టడం కరెక్ట్ కాదు అని పూరీ కూడా అనుకున్నారట. అందుకే ఆ ప్రాజెక్టును కొంతకాలం పాటు ఆపేసి,.. సెకండ్ ఇన్నింగ్స్ లో తనకు లైఫ్ ఇచ్చి... నిర్మాతగా కూడా తనకి కాసుల వర్షాన్ని కురిపించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనతో పూరి రంగంలోకి దిగిపోయాడని సమాచారం. ఆల్రెడీ సీక్వెల్ కి సంబంధించిన లైన్ ను సెట్ చేసుకుని స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూరీ మొదలు పెట్టినట్టుగా సమాచారం. 

అయితే ఈ సినిమా కోసం విజయ్ దేరకొండను తీసుకుంటారేమో అని అనుకున్నారు కొంత మంది ఫ్యాన్స్ కాని.. పూరీ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కూడా రామ్ తోనే చేయాలి అనుకుంటున్నారట. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ కు హిట్ సినిమాలు లేవు. ఆసినిమా తరువాత పూరీ కూడా లైగర్ తో భారీ ప్లాప్ అందుకున్నారు. దాంతో మళ్ళీ వీరిద్దరు కలిసి మరో సారి బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నారట. 

మాస్ ఆడియన్స్ ను ఇస్మార్ట్ శంకర్ ఏ స్థాయిలో ఊపేసిందనేది తెలిసిందే. అందువలన మళ్లీ రామ్ ను రంగంలోకి దింపే ప్రయత్నంలో పూరి ఉన్నాడు. అటు విజయ్ దేవరకొండ కూడా ప్రస్తుతం ఖుషితో బిజీగా ఉన్నాడు. దీనితో పాటు మరో సినిమాను కూడా చేసిన తరువాత 'జన గణ మన' లైన్లోకి రావొచ్చునని అంటున్నారు. ఇక రామ్ ప్రస్తుతం బోయపాటి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.