హుషారు లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన దినేష్ తేజ్‌ తాజాగా సోలో హీరోగా ఆకట్టుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత వెంకటేష్ కొత్తూరి తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దినేష్ సరసన శ్వేతా అవస్తీ హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ, లవ్‌, ఎమోషన్స్‌ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథతో ఈ మూవీ రూపొందుతోంది.

శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఫస్ట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్. తన చేతితో హీరోయిన్‌ కాలు పట్టుకున్న హీరో స్టిల్‌ను రిలీజ్ చేసిన మూవీ టీం ఈ సినిమా ఓ స్వచ్చమైన ప్రేమకథతో రూపొందుతుందన్న హింట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్.కె మాట్లాడుతూ... `మా మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న మా సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల చేస్తున్నాం. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా అవస్తి బాగా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మా సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంద`ని తెలిపారు.

గురురాజ్‌, బిందు, సంధ్య జనక్‌, శశాంక్‌, నానాజీలు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా కార్తీక్‌ కొడగండ్ల సంగీతం, నగేష్‌ బన్నెల్‌ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన త్వరలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలిపారు చిత్రయూనిట్‌.