తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు ఓపెన్‌ చేసుకునేందుకు అనుమతినిచ్చింది. నేటి నుంచే ఇది అమల్లోకి వస్తుంది. దీంతోపాటు పది కోట్ల లోపు బడ్జెట్‌ సినిమాలకు జీఎస్‌టీ రీఎంబర్స్ మెంట్‌ ఇస్తున్నట్టు తెలిపింది. థియేటర్లకు లాక్‌డౌన్‌ కరెంట్‌ ఛార్జీలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. బేసిక్‌ రేట్లని తగ్గిస్తున్నట్టు తెలిపింది. సినీ కార్మికులకు ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. దీంతో చిత్ర పరిశ్రమ నుంచి సంతోషం వ్యక్తమవుతుంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, రాజమౌళి, పూరీ జగన్నాథ్‌, గీతా ఆర్ట్స్ వంటి అనేక నిర్మాణ సంస్థలు, నిర్మాతలు, దర్శకులు, హీరోలు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఎగ్జిబిటర్లు గానీ, నిర్మాతలుగానీ థియేటర్‌ ఓపెనింగ్‌ విషయంలో సంతృష్తిగా లేరని తెలుస్తుంది. యాభై శాతం సిట్టింగ్‌ కెపాసిటీతో థియేటర్లు రన్‌ చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పినా, అందుకు సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. యాభై శాతం సిట్టింగ్‌ కెపాసిటీతో సినిమాని విడుదల చేస్తే కలెక్షన్లు రావడం కష్టం. ఇప్పుడు కరోనా ప్రభావంతో జనం థియేటర్‌కి రావడమే కష్టం. అది కూడా సగం కెపాసిటీతో థియేటర్‌ రన్‌ చేయడమంటే మరింత భారమంటున్నారు ఎగ్జిబిటర్లు. 

స్టార్‌ హీరో సినిమాలకు మొదటి మూడు రోజుల కలెక్షన్లు చాలా ముఖ్యం. ఇప్పుడు వారం రోజులు సినిమా ఆడటం చాలా గగనమైపోయింది. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్‌ సినిమాలకు కలెక్షన్లు రాబట్టడం చాలా కష్టమనే వాదన వినిపిస్తుంది. యాభై శాతం టికెట్లతో సినిమాలను నడిపించుకోలేమని నిర్మాతలు చెబుతున్నారు. 75శాతం నింపుకునేలా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటున్నారు. 

వంద శాతం ఆక్యుపెన్సీ లేకపోతే సినిమాలు విడుదల కావడం కష్టం. ఓ మోస్తారు నుంచి పెద్ద సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు సాహసం చేయరు. ఒకవేళ విడుదల చేసినా కలెక్షన్లు రావు. సినిమా బాగున్నప్పుడే, పెట్టిన బడ్జెట్‌ రావడం గగనమైపోతుంది. మరి సగం ఆడియెన్స్ తో అంటే నిర్మాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. ఇక షోలు పెంచుకునే వెసులుబాటుని, టికెట్ రేట్‌ను పెంచుకునే అవకాశం కల్పించినా, అది థియేటర్‌కి భారమవుతుందని ఎగ్జిబిటర్లు  వాపోతున్నారు. 

ఒక రోజు నాలుగు ఆటలకు బదులు.. 6 ఆటలు ప్రదర్శిస్తే, యాభై శాతం ఆక్యుపెన్సీని సమతూల్యం చేయోచ్చని ప్రభుత్వం చెబుతున్నా, ప్రాక్టికల్‌గా అది వర్కౌట్‌ కాదని, ఎక్కువ షోల వల్ల థియేటర్‌ ఖర్చులు పెరుగుతాయని అంటున్నారు. ఇది కలెక్షన్లపై, లాభాలపై ప్రభావం పడుతుంది. సో ఈ ప్రభుత్వ నిర్ణయం ఇప్పట్లో వర్కౌట్‌ అయ్యేలా లేదనే కామెంట్‌ కూడా వినిపిస్తుంది. దీనిపై పునరాలోచన చేయాలని అంటున్నారు. మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడిస్తుందో చూడాలి.