Asianet News TeluguAsianet News Telugu

పంతం నెగ్గించుకున్న తెలుగు సినీ కార్మికులు.. దిగొచ్చిన నిర్మాతలు, వేతనాల పెంపుకు గ్రీన్‌సిగ్నల్

తెలుగు సినీ కార్మికుల వేతనాలు పెంచేందుకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 30 శాతం వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో ఇప్పటికే చిత్రీకరణలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. 

producers council green signal for salaries hike for telugu cinema workers
Author
First Published Sep 14, 2022, 9:58 PM IST

తెలుగు సినీ కార్మికులకు నిర్మాతల మండలి శుభవార్త చెప్పింది. వేతనాలు పెంచేందుకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్మికులు కోరుతున్న 30 శాతం వేతనాలను పెంచేందుకు నిర్మాతలు సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. 30 శాతం వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో ఇప్పటికే చిత్రీకరణలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ ప్రకారం.. ప్రతి మూడేళ్లకు ఒకసారి కార్మికులకు వేతనాలు పెంచాల్సి వుండగా కోవిడ్ కారణంగా జాప్యమైంది. అయితే ఈసారి తమ డిమాండ్లను పరిష్కారించాల్సిందేనని ఫిల్మ్ ఫెడరేషన్ కృత నిశ్చయంతో వుంది. ఏం తేల్చని పక్షంలో సెప్టెంబర్ 16 నుంచి సమ్మె చేస్తామని ఫెడరేషన్ హెచ్చరించింది. దీనిని పరిగణనలోనికి తీసుకుని 30 శాతం వేతనాల పెంపుకు నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. 

Also REad:టాలీవుడ్‌లో సినిమా షూటింగ్స్ షురూ.. దిల్‌రాజు కీలక ప్రకటన, ఎప్పటినుంచి అంటే.?

అంతకుముందు ఆగస్ట్ 18న జరిగిన చర్చల సందర్భంగా నిర్మాతల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఓటీటీల్లో 55 రోజులు లేదా 8 వారాల తర్వాతే సినిమాను స్ట్రీమింగ్‌కు అనుమతించేలా నిర్ణయం తీసుకున్నట్లు దిల్‌రాజు తెలిపారు. మల్టీప్లెక్స్, థియేటర్ సమస్యలకు సంబంధించి కూడా చర్చించామని దిల్‌రాజు వివరించారు. టికెట్ ధరలు, తినుబండారాల ధరలు కూడా ప్రేక్షకులకు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకుంటామన్నారు. సింగిల్ స్క్రీన్ నిర్వాహకులతోనూ టికెట్ ధరలు, ఇతర సమస్యలకు సంబంధించి ఎగ్జిబిటర్లతో చర్చించామన్నారు. కాస్ట్ కటింగ్, ప్రొడక్షన్ ఖర్చులు తగ్గింపుకు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్- మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios