విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 25వ వర్థంతి నేడు(సోమవారం). ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు సినిమాపై ఆయన వేసిన ముద్రని చాటుకుంటున్నారు. బాలకృష్ణ స్పందిస్తూ, ఎన్టీఆర్‌తోనే ఆవేశం పుట్టిందన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ నేటికీ.. ముమ్మాటికీ ద్రువ తార మీరే` అని జూ.ఎన్టీఆర్‌ కొనియాడారు. నివాళులు అర్పించారు.

ఇక నిర్మాత రామ్‌ ఆచంట విభిన్నంగా స్పందించారు. `మరణం లేని జననం` అని పేర్కొంటూ బాలకృష్ణ డైలాగ్‌తో, ఎన్టీఆర్‌ సీన్స్ తో మేళవించిన వీడియోని పంచుకున్నారు. ఇందులో `లెజెండ్‌` చిత్రంలోని బాలకృష్ణ డైలాగ్‌కి ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చి ప్రచారం చేసిన నాటి సీన్లని కలిపారు. `సింహం నిద్ర లేచి, గడపదాటి జనంలోకి వచ్చి గర్జిస్తే, ఆ గర్జనకు ఢిల్లీ మ్యాప్‌ షేపే మారిపోతుంది` అని బాలకృష్ణ ఆవేశంతో అనగా, ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కి సంబంధించిన సన్నివేశాలు, ఆవేశంతో కూడిన హవాభావాలు, ఎన్నికల ప్రచారంలోని క్లిప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. 

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. కాగా బాలకృష్ణ నటించిన `లెజెండ్‌` చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై రామ్‌ఆచంట, గోపీఆచంట నిర్మించారు. ప్రస్తుతం 14 రీల్స్ ప్లస్‌ బ్యానర్‌పై సినిమాలు చేస్తున్నారు.