Asianet News TeluguAsianet News Telugu

లోక్‌ సభ ఎన్నికల తర్వాతే `యాత్ర2`.. సెన్సార్‌ చేయోద్దంటూ నిర్మాత డిమాండ్‌..

ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సీఎం కాకముందు చేపట్టిన ఓదార్పు యాత్ర ఆధారంగా `యాత్ర 2` సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ సెన్సార్ చేయోదంటూ నిర్మాత బోర్డ్ కి లేఖ రాశారు.

producer natti kumar wrote a letter to censor board about yatr2 not to censor arj
Author
First Published Jan 23, 2024, 11:06 PM IST | Last Updated Jan 23, 2024, 11:06 PM IST

ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర ప్రధానంగా సాగే `యాత్ర 2` చిత్ర విడుదల ఆపాలంటూ నిర్మాత డిమాండ్‌ చేస్తున్నారు. లోక్‌ సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు సినిమా సెన్సార్‌ చేయోద్దని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సెన్సార్‌ బోర్డ్ కి లేఖ రాశారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, టీడీపీ సానుభూతి పరుడైన నట్టి కుమార్‌.. సోమవారం ఆయన సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్‌ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ చైర్‌ పర్సన్‌, సీఈవో, హైదరాబాద్‌ రీజినల్‌ సెన్సార్‌ ఆఫీస్‌కి లేఖ రాశారు. 

ఈ లేఖలో ఆయన చెబుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ పార్టీకి, అలాగే ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పూర్తిగా అనుకూలంగా ఈ సినిమాను తీశారని ఆ లెటర్ లో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధినేత సోనియాగాంధీకి వ్యతిరేకంగా సినిమా తీయడంతో పాటు  వారి పాత్రలను కించపరుస్తూ, వ్యంగ్యంగా ఈ చిత్రంలో  చిత్రీకరించారని వివరించారు. పబ్లిసిటీ కోసం విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌నే ఇందుకు ఓ ఉదాహరణ అని, వారితో దగ్గరి పోలికలు ఉన్న ఆర్టిస్టులను ఈ సినిమాలో పెట్టి  కుట్రదారులుగా చూపించారని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియాగాంధీని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడును చులకనగా చూపించడం వెనుక త్వరలో జరగబోయే  లోక్‌సభ ఎన్నికల్లో  ప్రత్యేకంగా  వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ , ప్రయోజనం పొందాలన్న ఉద్దేశ్యం కనిపిస్తోందన్నారు. త్వరలో  లోక్ సభ ఎన్నికల కోడ్ రాబోతున్న సమయంలో ఈ సినిమాను కరెక్టు గా ఇదే టైం లో విడుదల చేసేందుకు నిర్ణయించడం కూడా దురుద్దేశమే. ఇంకా సెన్సార్ చేయకుండానే  ఈ సినిమా విడుదల తేదీని ఫిబ్రవరి 8వ తేదీగా ప్రకటించారు. వాస్తవానికి సెన్సార్ మార్గదర్శకాల ప్రకారం సెన్సార్ జరపకుండా  విడుదల తేదీని ప్రకటించడం నిబంధనలకు విరుద్ధం. దీనిపై కూడా సెన్సార్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు ఈ చిత్రాన్ని సెన్సార్ చేయవద్దని మనవి చేస్తున్నాను. 

ఎన్నికల తర్వాతే సెన్సార్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను, అప్పుడు కూడా ఈ చిత్రంలోని  పాత్రలు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, వ్యంగ్యంగా, అవమానకరంగా, కుట్రపూరితంగా లేకుండా సెన్సార్ చేయాలి. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం సినిమా సెన్సార్ చేయడానికి  66 రోజుల వరకు వ్యవధి  ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి సున్నితమైన రాజకీయ అంశాలతో కూడిన సినిమాను సెన్సార్ చేయడం ఈ టైమ్ లో  కరెక్ట్ కాదన్నారు. 

ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, తెలంగాణలో కూడా ఎన్నికలకు ముందు విడుదలైతే ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఎన్నికల తర్వాత ఈ సినిమాకి సెన్సార్ జరగాలి. అలాగే సెన్సార్ కోసం దరఖాస్తు చేసుకున్న చాలా చిత్రాలను ప్రాధాన్యతా క్రమంలో మాత్రమే చూడాలి. ఈ విషయంలో చిన్నా పెద్దా అనే తేడా ఉండకూడదు. పైన పేర్కొన్న మా నాయకులను కించపరిచే సన్నివేశాలతో  ఈ చిత్రాన్ని ఎన్నికల ముందు సెన్సార్ లేదా విడుదల చేయడానికి ప్రయత్నించినట్లయితే, మేము లీగల్ గా  ముందుకు వెళ్తానని మీకు తెలియజేస్తున్నానని నట్టి కుమార్ తాను రాసిన లెటర్ లో పేర్కొన్నారు. జీవా జగన్‌ పాత్రలో, మమ్ముట్టీ వైఎస్‌ పాత్రలో నటించిన `యాత్ర2`కి మహి వీ రాఘవ్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఫిబ్రవరి 8న విడుదల చేయబోతున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios