డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు ఛార్జీలు తగ్గించాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పాటు థియేటర్లు బంద్ చేశారు. ఈ విషయంలో నిర్మాతలంతా ఒకేమాటపై నిలబడటంతో వారం రోజులుగా ఎక్కడా షోలు పడలేదు. ఎట్టకేలకు సర్వీస్ ప్రొవైడర్లు రేట్లు తగ్గించడంతో వెండితెర తిరిగి కళకళలాడనుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ బంద్ వల్ల పెద్ద నిర్మాతలకు తప్ప చిన్న సినిమాల నిర్మాత ఒరిగిందేం లేదంటున్నాడు ప్రొడ్యూసర్ నట్టి కుమార్. 

మార్చి పరీక్షల సీజన్ కావడంతో పెద్ద హీరోలు - భారీ బడ్జెట్ చిత్రాల రిలీజులేవీ ప్లాన్ చేయలేదు. సాధారణంగా ఇలాంటి టైంలో చిన్న సినిమాలకు అవకాశం లభిస్తుంది. కానీ ఈసారి బంద్ పిలుపుతో రిలీజులన్నింటినీ వాయిదా వేశారు. ‘‘ఈ నెలంతా చిన్న సినిమాలు రిలీజ్ కావాలి. వాళ్లందరూ ఆగిపోయారు. 30వ తేదీ రంగస్థలం సినిమా వచ్చేయాలి. భరత్ అనే నేను.. నాపేరు సూర్య రిలీజైపోవాలి. వాటి రిలీజుకు ముందు బంద్ చెయ్యలేదు. బంద్ చేస్తే పెద్ద నిర్మాతలకు నష్టం. కానీ చిన్న నిర్మాతలు మాత్రం రిలీజులు ఆపుకుని.. చేసిన ఖర్చుకు వడ్డీలు కట్టుకుని రోడ్డున పడిపోవాలా?’’ అంటూ నట్టి కుమార్ ఫైరయిపోయాడు. 

డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు ఛార్జీలు కొంత తగ్గించడం దీనివల్ల నిర్మాతలకు లాభమంటూ కొందరు చెబుతున్నారని.. కానీ ఇప్పుడున్న ఖర్చు కూడా చిన్ననిర్మాత భరాయించలేడని అంటున్నారు నట్టి కుమార్. ధైర్యముంటే ఛార్జీలు పూర్తిగా ఎత్తేసేంతవరకు పెద్ద నిర్మాతల సినిమాలయినా పక్కన పెట్టి బంద్ కంటిన్యూ చేయాలని అంటున్నాడు. అల్లు అరవింద్.. సురేష్ బాబు స్వార్ధం కోస చిన్న నిర్మాతలను వీధులపాలు చేస్తున్నాడని ఆవేదనగా చెబుతున్నాడు. చిన్న నిర్మాతల వరకు ఈయన చెప్పేది వాలిడ్ పాయింటేగా...