స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు టైం మాములుగా లేదు. డిస్ట్రిబ్యూటర్ గా ఆయన కోట్లు కొల్లగొడుతున్నారు. నిర్మాతగా కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాలు ఆయనకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
దిల్ రాజుని నైజాం కింగ్ (Dil Raju) అంటారు. పదుల సంఖ్యలో థియేటర్స్ కలిగి ఉన్న దిల్ రాజు పెద్ద చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సౌత్ ఇండియా నుండి విడుదలైన మూడు పాన్ ఇండియా చిత్రాలు దిల్ రాజు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశారు. వాటిలో ఒకటి భారీ నష్టాలు మిగల్చగా మిగతా రెండు భారీ లాభాలు పంచుతున్నాయి. రాధే శ్యామ్ (Radhe Shyam) చిత్రాన్ని దిల్ రాజు రూ. 40 కోట్లకు కొన్నారు. అయితే పెట్టుబడిలో యాభై శాతం కూడా రాబట్టలేకపోయింది.
రాధే శ్యామ్ చిత్రం వలన కలిగిన నష్టాలను ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)పూడ్చడం తో పాటు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఆర్ ఆర్ ఆర్ నైజాం హక్కులను దిల్ రాజు రూ. 70 కోట్లకు దక్కించుకున్నారు. తెలుగులో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆర్ ఆర్ ఆర్ ఏకంగా రూ. 110 కోట్ల షేర్ వసూలు చేసింది. నాలుగవ వారం కూడా ఆర్ ఆర్ ఆర్ రన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఫిగర్ మరింత పైకెళ్లే అవకాశం కలదు. అంటే పెట్టుబడి కంటే 80-90 శాతం లాభాలు ఆర్ ఆర్ ఆర్ మూవీతో దిల్ రాజు ఆర్జించారు.
ఆర్ ఆర్ ఆర్ జోరు తగ్గక ముందే థియేటర్స్ లో దిగిన కెజిఎఫ్ 2(KGF Chapter 2) వసూళ్ల వరద పారిస్తుంది. కెజిఎఫ్ చాప్టర్ 2 నైజాం హక్కులను దిల్ రాజు రూ. 25 కోట్లకు దక్కించుకున్నారు. ఓ డబ్బింగ్ చిత్రానికి నైజాంలో ఇది రికార్డు ధర. సినిమాపై నమ్మకంతో దిల్ రాజు హక్కులు తీసుకోగా, ఇప్పుడు లాభాల వర్షం కురిపిస్తుంది. వీకెండ్ ముగిసే నాటికే దిల్ రాజు పెట్టుబడి వచ్చేసింది. నాలుగు రోజులకు గానూ కెజిఎఫ్ 2 రూ. 28 కోట్ల షేర్ వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ ఉన్న కెజిఎఫ్ 2 రూ. 50 కోట్ల షేర్ ఈజీగా అందుకునేలా కనిపిస్తుంది.
చిరంజీవి ఆచార్య విడుదలయ్యే వరకు తెలుగులో కెజిఎఫ్ 2 చిత్రానికి పోటీలేదు. ఈ క్రమంలో కెజిఎఫ్ తో రెండు రెట్లు లాభం దిల్ రాజు పాకెట్ లోకి చేరనుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2 అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేయడంతో దిల్ రాజుకు లాభాల పంట పండింది. నిర్మాతగా ఓ హిట్ మూవీ ఇచ్చే లాభాల కంటే ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2 డిస్ట్రిబ్యూటర్ గా దక్కించుకుంటున్నది చాలా ఎక్కువని చెప్పవచ్చు.
