సైబర్‌ నేరగాళ్లకి సినీ సెలబ్రిటీలు అతీతం కావడం లేదు. వారి బారిన పడి లక్షల్లో మోసపోతున్నారు. తాజాగా సైబర్‌ నేరగాళ్ల బారిన ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ కూడా పడటం హాట్‌ టాపిక్‌ అవుతుంది.

సెబర్‌ నేరగాళ్లు ఇటీవల కాలంలో బాగా రెచ్చిపోతున్నారు. ఎంతో మంది సాధారణ ప్రజల అకౌంట్ల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా సైబర్‌ నేరగాళ్ల బారిన ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ కూడా పడటం హాట్‌ టాపిక్‌ అవుతుంది. బాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్న బోనీ కపూర్‌.. అతిలోక సుందరి శ్రీదేవి భర్త అనే విషయం తెలిసిందే. ఆయన్నుంచి తాజాగా సైబర్‌ కేటుగాళ్లు 3.82 లక్షలు స్వాహా చేశారు. 

ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన క్రెడిట్‌ కార్డ్ ద్వారా సదరు అమౌంట్‌ని దోచుకున్నట్టు నిర్మాత బోనీ కపూర్‌ బుధవారం(మే 25)న ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం కింద అంబోలీ పోలీసులు కేసు నమోదు చేశారు. బోనీ కపూర్‌ క్రెడిట్‌ కార్డు వివరాలు, పాస్‌వర్డ్ తదితర డేటాని నిందుతులు చోరీ చేసినట్టు తెలుస్తుంది. ఈ డేటా సహయంతో ఫిబ్రవరి 9న ఐదు ఆన్‌లైన్‌ ట్రాన్సక్షన్స్ జరిపారని తెలుస్తుంది. 

అయితే ఈ లావాదేవీలు జరిపినప్పుడు బోనీ కపూర్‌కు తెలియదని, బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డు బిల్లు నిమిత్తం బోనీ కపూర్‌కు ఫోన్ వచ్చింది. తర్వాత అకౌంట్స్‌ చెక్‌ చేసినప్పుడు తాను డబ్బు పోగోట్టుకున్నట్లు గ్రహించారని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చోరీకి గురైన డబ్బు గురుగ్రామ్‌లోని ఓ కంపెనీ అకౌంట్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు అంబోలీ పోలీస్‌ స్టేషన్‌లోని ఒక అధికారి పేర్కొన్నారు.

నిర్మాతగా బోనీ కపూర్ అనేక సినిమాలను నిర్మించాడు. అజిత్ హీరోగా నటించిన `నేర్కొండ పార్వై`, ‘వలీమై’(Valimai), పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘వకీల్ సాబ్’(Vakeel Saab) సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం అజయ్ దేవగణ్‌తో ‘మైదాన్’(Maidaan)ను నిర్మిస్తున్నాడు.