యువ నిర్మాత బన్నీ వాసు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బన్నీ వాసు అన్నయ్య గవర సురేష్‌ అనారోగ్యంతో అకాల మృతి చెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధి కారణంగా ఆయన మరణించడం జరిగింది. బెంగుళూరులోని ప్రైవేటు ఆసుప్రతిలో కొన్నాళ్లుగా గవర సురేష్ చికిత్స తీసుకుంటున్నారు. రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం. గవర సురేష్ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు. 

 
 సురేష్‌కు భార్యమరియు  కుమారుడు ఉన్నారు. బన్నీ వాసు కుటంబం స్వస్థలం పాలకొల్లు. తండ్రి గవర సూర్యనారాయణకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. చిన్న కుమారుడు బన్నీ వాసు నిర్మాతగా పలు హిట్ చిత్రాలు నిర్మించారు. అల్లు అరవింద్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బన్నీ వాసు, చాలా చిన్న స్థాయి నుండి నిర్మాతగా ఎదిగారు. 
 
 పెద్దకుమారుడు సురేష్ ఇంజనీరింగ్ చదివి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబందించిన ఇంజనీర్లలో అగ్రగణ్యుడిగా ఉన్నారు. డీజిల్, పెట్రోలు 4 వీలర్ వెహికల్ లను సీఎన్‌జీ(కంప్రెసర్,నేచురల్ గ్యాస్)లోకి కన్వెర్షన్ చేసే కిట్స్ తయారీ కంపెనీ స్థాపించి అగ్రగణ్యునిగా ఎదిగారు. గవర సురేష్  అకాల మరణం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.