గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో దర్శకులు తనపై కోపంతో కేకలు వేసేవారని షాకింగ్ కామెంట్స్ చేసింది. చాలా సినిమాల్లో తనను తీసుకొని మళ్లీ తొలగించారని వెల్లడించింది.

తనపై దర్శకులు అరిచేవారని.. సినిమా కోసం తీసుకొని మళ్లీ తీసేసేవారని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తన తండ్రి ఎంతో ధైర్యం చెప్పేవారని తెలిపింది. తనలో తనే ఆత్మస్థైర్యాన్ని నింపుకొని పరాజయం తరువాత ఏం చేస్తే, ఎలా చేస్తే  విజయం సాధించొచ్చనే విషయాలను నేర్చుకున్నట్లు వెల్లడించింది. 

ఇండస్ట్రీలో 'మేరీకోమ్', 'బాజీరావ్ మస్తానీ' లాంటి ఎన్నో హిట్టు సినిమాలు చేసిన ఈ భామ ఆ విజయాల వెనుక ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'స్కై ఈజ్ పింక్' అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

నిజజీవిత సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు. చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురైనప్పటికీ.. పదిహేనేళ్లకే రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌదరి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సోనాలీ బోస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ప్రియాంక తల్లి పాత్ర పోషిస్తోంది.