మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్నాక.. బాలీవుడ్ లో ఎంటరై తనదైన శైలితో అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు హీరోలను కూడా సవాల్ చేసే రేంజ్ కు ఎదిగింది. నాలుగేళ్ల క్రితం వరకూ ప్రియాంక ఒక సాధారణ హీరోయిన్. కానీ ఇప్పుడు హాలీవుడ్ లో సైతం సత్తా చాటి తన  రేంజ్ ఏంటో చూపిస్తున్న బోల్డ్ బ్యూటీ.

 

హాలీవుడ్ లో టెలివిజన్ షో ‘క్వాంటికో' ద్వారా ప్రియాంక ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. తొలి సీజన్లోనే మంచి పేరు సంపాదించిన ప్రియాంక.. రెండు, మూడు సీజన్లలోనూ అదరగొట్టేస్తోంది. ఆమెకు ఈ టీవీ సిరీస్‌లో నటించినందుకు అమెరికా పీపుల్స్ ఛాయిస్ అవార్డు కూడా దక్కింది. ‘క్వాంటికో'లో సీజన్‌కు మూడు మిలియన్ డాలర్ల చొప్పున ఆమె పారితోషకం పుచ్చుకున్నట్లు సమాచారం.

 

గత ఏడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది మే 31 లోపు ఏడాది కాలానికి ప్రియాంక 10.5 మిలియన్ డాలర్ల దాకా ఆర్జించిందట. అంటే రూపాయల్లో చెప్పాలంటే రూ.70 కోట్లన్నమాట. ఒక బాలీవుడ్ హీరోయిన్ ఏడాదిలో ఇంత మొత్తం సంపాదించడం చిన్న విషయం కాదు. ప్రపంచంలో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న అంత‌ర్జాతీయ స్టార్ ప్రియాంక చోప్రా.. మ‌రోసారి ప్రపంచంలో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న టీవీ యాక్టర్ల జాబితాలో చోటు సంపాదించింది. ఫోర్బ్స్ మేగ‌జైన్ విడుద‌ల చేసిన జాబితాలో ఈ సారి కూడా ఎనిమిదో స్థానంలో నిలిచి టాప్ 10లో మ‌రోసారి నిలిచింది.

 

జూన్ 1, 2016 నుంచి జూన్ 1, 2017 మ‌ధ్య కాలంలో ప్రియాంక 10 మిలియ‌న్ డాల‌ర్లు కేవలం టీవీ షోల ద్వారానే సంపాదించిన‌ట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ఇందులో 50 శాతానికి పైగా ఆదాయం ప్ర‌క‌ట‌న‌ల ద్వారానే పొందిన‌ట్లు తెలిపింది.  `క్వాంటికో` టీవీ సిరీస్ ద్వారా హాలీవుడ్ బుల్లితెర మీద అడుగు పెట్టిన ప్రియాంక, కొద్దికాలంలోనే త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. సోఫియా వెర్గారా రూపొంది ప్ర‌స్తుతం ఈ టీవీ సిరీస్‌కి సంబంధించిన మూడో సీజ‌న్ షూటింగ్‌లో ప్రియాంక పాల్గొంటోంది.

 

ఫోర్బ్స్ జాబితాలో ఈసారి కూడా గ‌త ఆరేళ్ల నుంచి టాపర్ గా నిలుస్తున్న కొలంబియా న‌టి సోఫియా వెర్గారా 41.5 మిలియ‌న్ డాల‌ర్ల సంపాద‌న‌తో మొద‌టి స్థానంలో నిలిచింది. ఈమె న‌టిస్తున్న `మోడ్ర‌న్ ఫ్యామిలీ` టీవీ సిరీస్‌కు అమెరికాలో మంచి పేరుంది. ఇక ప్రియాంక కూడా బాలీవుడ్ లో ఎక్కువంటే.. 30 కోట్ల వరకు సంపాదించేది. హాలీవుడ్  స్థాయికి వెళ్లిపోయాక.. భారీగా ఆదాయం మూటగట్టుకుంటోంది. ఆమెకు వాణిజ్య ఒప్పందాల ద్వారా కూడా భారీగానే ముడుతోంది. గత ఏడాదిలో చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆమె చేతికి వచ్చాయి.