ప్రియదర్శి డిఫరెంట్ కంటెంట్ ఉన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. కామెడీ, సీరియస్ కంటెంట్ ఏదైనా తన బెస్ట్ ఇస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా ఆయన `మిత్ర మండలి` అంటూ రచ్చ చేసేందుకు వస్తున్నారు.
నటుడు ప్రియదర్శి కంటెంట్ ఉన్న చిత్రాలతో అలరిస్తున్నాడు. `పెళ్లిచూపులు` నుంచి అదే పంథాని ఫాలో అవుతున్నాడు. ఇటీవల `కోర్ట్`లో లాయర్‌గా అదరగొట్టాడు. అలాగే `సారంగపాణి`లోనూ తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు.
ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు. తాజాగా `మిత్రమండలి` పేరుతో సినిమా చేస్తున్నాడు. తన `మిత్ర మండలి`తో ఆయన ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నాడు.
స్నేహం ప్రధానంగా `మిత్ర మండలి`
స్నేహం ప్రధానంగా సాగే మూవీ ఇది. నలుగురు స్నేహితులు కలిసి చేసే రచ్చ ఎలా ఉంటుందో ఈ మూవీలో చూడొచ్చు అంటోంది టీమ్. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు సమర్పణలో ఈ మూవీ తెరకెక్కుతుండటం విశేషం.
ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ప్రీ లుక్ కి విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ముసుగు అవతారాలలో ఉన్న నటులు ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో కలిగింది. తాజాగా శుక్రవారం ఈ చిత్ర టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు నిర్మాతలు.
ప్రియదర్శి `మిత్ర మండలి` గ్యాంగ్ ఇదే..
ఈ చిత్రానికి "మిత్ర మండలి" అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ తోపాటు, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ నీలిరంగు ముసుగుల వెనుక ఉన్న గ్యాంగ్ ను పరిచయం చేసింది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం "మిత్ర మండలి" చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తుండటం విశేషం. సోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన నిహారిక.. ఇటీవల 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' కోసం టామ్ క్రూజ్‌తో కలిసి పనిచేసి వార్తల్లో నిలిచారు.
`మిత్ర మండలి`తో రచ్చకు రెడీ
అద్భుతమైన నటన, కామిక్ టైమింగ్, భిన్నమైన పాత్రల ఎంపికతో ప్రియదర్శి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయనకు 'మ్యాడ్' ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా వంటి ప్రతిభగల నటులు తోడయ్యారు. ఈ నలుగురు కలిసి 'మిత్ర మండలి'తో రచ్చ చేయబోతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
బన్నీ వాస్ తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై 'మిత్ర మండలి' చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు.
నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. `'మిత్ర మండలి' అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుందని, మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైందని టీమ్ తెలిపింది.


