స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ చిత్రాలు నిర్మించడం మాత్రమే కాదు.. కథ నచ్చితే చిన్న బడ్జెట్ చిత్రాలని కూడా తన బ్యానర్ లో రూపొందిస్తారు. బడ్జెట్ లెక్కలో దిల్ రాజుని మించిన వారు టాలీవుడ్ లో లేరని చెబుతారు.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ చిత్రాలు నిర్మించడం మాత్రమే కాదు.. కథ నచ్చితే చిన్న బడ్జెట్ చిత్రాలని కూడా తన బ్యానర్ లో రూపొందిస్తారు. బడ్జెట్ లెక్కలో దిల్ రాజుని మించిన వారు టాలీవుడ్ లో లేరని చెబుతారు. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ.. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కింది ఈ చిత్రం. 

శుక్రవారం రోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ రోజు నుంచే ఈ చిత్రం ఊహించని విధంగా కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ దినపత్రికకి చెందిన జర్నలిస్ట్ సతీష్ గడ్డం.. బలగం కథ నాది అంటూ తెరపైకి వచ్చారు. ఈ కథ నాదే అంటూ ఆయన ఆధారాలు కూడా చూపుతుండడంతో ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది. 

గడ్డం సతీష్ మీడియాతో మాట్లాడుతూ.. బలగం చిత్ర ప్రీమియర్ షో చూడడానికి నాకు ఆహ్వానం వస్తే వెళ్ళాను. సినిమా చూస్తే ఇది నా కథే కదా అని ఆశ్చర్యపోయాను. బలగం కథని నేను 2011లోనే 'పచ్చికి' పేరుతో రాశాను. ఆ కథ 2014లో ప్రముఖ పత్రికలో ప్రచురించబడింది. 

ఆ కథతోనే వేణు, దిల్ రాజు ఈ బలగం చిత్రం తీశారు. కొన్ని చిన్న చిన్న మార్పులు మాత్రమే చేశారు. 90 శాతం కథ ఒకేలా ఉంది అంటూ సతీష్ ఆరోపిస్తున్నారు. గడ్డం సతీష్ ఇంకా మాట్లాడుతూ.. ఇప్పటికైనా దిల్ రాజుకి తెలంగాణ కథలపై మనసు పడింది.. సంతోషం. కానీ ఒక కథని ఎంచుకునేటప్పుడు ఆ కథకి మూలం ఏంటి అని చూసుకోవడం నిర్మాతగా దిల్ రాజు బాధ్యత. 

తన తాతగారు మరణించినప్పుడు ఆ పరిస్థితుల ఆధారంగా పచ్చికి కథ రాశానని గడ్డం సతీష్ తెలిపారు. 2011లో ఈ కథని రాయగా అప్పడు ఆంధ్రవాళ్ల చేతుల్లో ఉనన్ మీడియా తెలంగాణ యాసలో ఉందని దీనిని ప్రచురించలేదు. ఆ తర్వాత 2014లో తెలంగాణాకి చెందిన వార్త పత్రిక తన కథని ప్రచురించినట్లు సతీష్ తెలిపారు. మనిషి చనిపోయినప్పుడు పక్షులకు అన్నం పెడతారు. ఆ అంశాలు నా కథలో రాసుకున్నా. బలగం, పచ్చికి రెండు కథలో హీరో మనవడే ఉంటాడు. బలగం, పచ్చికి మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయని సతీష్ అన్నారు. 

బలగం చిత్రంలో కథకి తనకు క్రెడిట్ ఇవ్వాలి అని సతీష్ డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తాను చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతానని హెచ్చరించారు. శుక్రవారం రిలీజైన బలగం చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించారు. సతీష్ చేస్తున్న కాపీ రైట్ ఆరోపణలపై బలగం టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.