ఒకే ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయారు మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఆమె నటించిన తొలి చిత్రం ‘ఒరు అదార్‌ ‌ లవ్‌’ టీజర్‌లోని అభినయం దేశవ్యాప్తంగా ఆమెకు ఎనలేని క్రేజ్‌ తెచ్చిపెట్టింది. ఆమె కనుసైగల సమ్మోహనం ఎన్నో యువ హృదయాలను గిలిగింతలు పెట్టింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు అభిమానుల తాకిడి ఎక్కువైపోయింది. ఏకంగా అతి తక్కువ కాలంలోనే 5.8మిలియన్ల ఫాలోవర్లు చేరిపోయారు. ఇప్పుడు ఆమె పాలిట ఇదే వరమైంది. ఆమెకున్న క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు పలు కంపెనీలు వరుస కడుతున్నాయట. దీంతో తొలి సినిమాతో తెచ్చుకున్న క్రేజ్‌తో తెలుగు, తమిళం, హిందీ నుంచి సినిమా అవకాశాలే కాదు తమ ఉత్పత్తులను ప్రచారం చేసి పెట్టాలని పలు కంపెనీలు ఆమెను సంప్రదిస్తున్నాయట. తన ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో తమ ఉత్పత్తి గురించి ఓ పోస్టు పెడితే దానికి భారీ స్థాయిలో రెమ్యునేషన్‌ చెల్లిస్తామంటూ ఆఫర్‌ చేస్తున్నట్లు సమాచారం.

ప్రియా ప్రకాశ్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో తమ ఉత్పత్తి గురించి ఓ పోస్టు చేస్తే రూ.8లక్షల దాకా ఇస్తామంటూ పలు సంస్థలు ఆఫర్‌ చేశాయని వార్తలు విన్పిస్తున్నాయి. తొలి చిత్రం ఇంకా విడుదల కాకుండానే ప్రియా ప్రకాశ్‌కు ఈ స్థాయిలో వస్తున్న ఆఫర్స్‌పై సినీ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ లాంటి వారికి సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ ఉందని.. ఆమె ఒక్కో పోస్టుకి అధిక మొత్తంలో వసూలు చేస్తారని సమాచారం. ఇక ప్రియా ప్రకాశ్‌ నటించిన తొలి చిత్రం ‘ఒరు అదార్‌ లవ్‌’ జులైలో విడుదల కావాల్సి ఉంది.