`సలార్` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన హీరోగా నటించిన మూవీ నాలుగు నెలల తర్వాత ఓటీటీలో రాబోతుంది.
`సలార్` సినిమాతో అదరగొట్టాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఇందులో వరధరాజ మన్నార్ పాత్రలో ప్రభాస్‌కి ఫ్రెండ్‌గా నటించి మెప్పించాడు. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. ఆ క్రేజ్‌తో ఆయన హీరోగా నటించిన మలయాళ మూవీ `ది గోట్ లైఫ్`ని తెలుగులో విడుదల చేశారు. దీన్ని పాన్ ఇండియా తరహాలో మార్చి 28న మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో విడుదల చేశారు. మలయాళ దర్శకుడు బ్లెస్సీ రూపొందించిన ఈ మూవీ రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కింది.
మలయాళంలో బెస్ట్ సెల్లింగ్ నవల `ఆడుజీవితం` ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సౌదీ అరేబియాకి వలస వెళ్లిన కేరళాకి చెందిన నజీబ్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా రాసిన నవల ఇది. దీన్ని `ది గోట్ లైఫ్` పేరుతో సినిమాగా తీశారు. నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ నటించారు. కేరళా నుంచి చాలా మంది దుబాయ్, సౌదీ వంటి అరబ్ కంట్రీస్‌కి ఉపాధి కోసం వలస వెళ్తుంటారు. అలా నజీబ్ కూడా వెళ్లారు. కానీ సౌదీ ఎయిర్ పోర్ట్ లో మిస్ అయ్యారు. తమను తీసుకెళ్లాల్సిన వ్యాపారి రాలేదు. దీంతో వేరే వాళ్లు నజీబ్‌తోపాటు ఆయన ఫ్రెండ్‌ని తీసుకెళ్లారు. ఏడారిలో గోర్లు కాసే పనిలో పెట్టారు.
భాష రాక, ఏం అర్థం కాక, ఎక్కడికి వచ్చామో కూడా తెలియక, అక్కడి లైఫ్‌ని తట్టుకోలేక నానా కష్టాలు పడ్డారు. వందల కిలోమీటర్ల ఏడారిలో బానిసలుగా బతకాల్సి వచ్చింది. కొన్నేళ్ల తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఓ విదేశీయుడితో కలిసి నజీబ్, అతని ఫ్రెండ్ తప్పించుకుని పారిపోయి వస్తారు. ఈ ప్రయాణంలో వారికి నీళ్లు లేక, ఫుడ్ లేక నానా అవస్థలు పడతారు. కొన్ని వందల కిలోమీటర్లు ఇసుకలో ప్రయాణించి కేవలం నజీబ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఎట్టకేలకు సొంతూరుకి వచ్చారు. అత్యంత హృదయవిదారకమైన ఈ ఘటన ఆధారంగా `ఆడుజీవితం` నవల రాశారు. దాన్ని సినిమాగా తెరకెక్కించారు బ్లెస్సీ. పృథ్వీరాజ్ నిర్మించారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. మలయాళంలో పెద్ద హిట్ అయ్యింది. ఇతర భాషల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మలయాళంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన నాల్గో సినిమాగా నిలవడం విశేషం.
ఈ సినిమా ఇప్పటి వరకు ఓటీటీలో రాలేదు. ఓ హిట్ ఫిల్మ్ నాలుగు నెలలైనా ఓటీటీలో రాకపోవడం ఆశ్చర్యకరం. ఇన్నాళ్లకి ఓటీటీలో రాబోతుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజాగా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. జులై 19న సినిమాని విడుదల చేయబోతున్నారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
