హీరో అఖిల్‌ త్వరలో పెళ్ళిపీఠలెక్కబోతున్నాడా? ఆయన తాను చేసుకోబోయే అమ్మాయిని చూసుకున్నాడా? అఖిల్‌ పెళ్ళి చేసుకునేది వ్యాపారవేత్త కూతురినా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇటీవల వరుసగా టాలీవుడ్‌లో పెళ్లిళ్ళు జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అఖిల్‌ పెళ్ళి తెరపైకి రావడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. 

నిజానికి అఖిల్‌ మ్యారేజ్‌ మూడేళ్ళ క్రితమే జరగాల్సింది. ఆయన శ్రేయా భూపాల్‌ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకునేందుకు సిద్ధ పడ్డాడు. ఇరు కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పారు. అఖిల్‌ పెళ్ళిని నాగార్జున సైతం అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. కానీ సడెన్‌గా వీరి మ్యారేజ్‌ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏమైందో ఏమో వీరిద్దరు విడిపోయారు. దీంతో అన్నయ్య చైతూ కంటే ముందే కావాల్సిన మ్యారేజ్‌ క్యాన్సిల్‌ అయ్యింది. శ్రేయాకి మరో వ్యక్తితో వివాహమయ్యింది.

ఆ తర్వాత అఖిల్‌ పెళ్ళికి సంబంధించి ఎలాంటి వార్తలు లేవు. ఆ ఘటన వల్లే అఖిల్‌ కాస్త డిస్టర్బ్ అయ్యాడనే టాక్‌ వినిపించింది. తాజాగా మరోసారి ఆయన మ్యారేజ్‌ విషయం చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యాపారవేత్తకు చెందిన కూతురితో అఖిల్‌ వివాహం జరగబోతుందనే టాక్‌ వినిపిస్తుంది. అయితే ఈ పెళ్ళికి పెద్దగా అఖిల్‌ వదిన, చైతూ భార్య, స్టార్‌ హీరోయిన్‌ సమంత వ్యవహరించనుండటం విశేషం. 

అటు అమ్మాయి పేరెంట్స్ ని, ఇటు నాగ్‌ ఫ్యామిలీని ఒప్పించే పనిలో సమంత బిజీగా ఉన్నారు. అంతేకాదు, ఈ పెళ్ళిని సెట్‌ చేసింది కూడా సమంతనే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఏ క్షణంలోనైనా అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని టాలీవుడ్‌లో గుసగుసలు, సోషల్‌ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.