సినీ పరిశ్రమ నుంచి ఆమెకు మద్దతుగా ఎవరూ నిలబడలేదు కానీ ప్రకాష్ రాజ్ ఆమెకు మద్దతు ప్రకటించారు.
విరాటపర్వం ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి పలు ఇంటర్వ్యూలలో పాల్గొని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయం గురించి మాట్లాడుతూ.. ఆపై కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. వివాదాస్పదమయ్యాయి. సాయి పల్లవి గో రక్షకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఈ నేపధ్యంలో సాయి పల్లవి ఆ వివాదంపై స్పందిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. తాను తన జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఓ అంశంపై తాను వివరణ ఇస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. తన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని.. చివరకు పేరొందిన మీడియా సంస్థలు సైతం తన వ్యాఖ్యలను పూర్తిగా వినకుండా తమకు తోచింది రాసుకుపోయాయని సాయి పల్లవి వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తనపై చేసిన ఆరోపణల కారణంగా గత కొద్దిరోజులుగా తాను మానసికంగా ఎంతో క్షోభకు గురయ్యాయనని కూడా ఆమె చెప్పుకొచ్చారు.
అయితే సినీ పరిశ్రమ నుంచి ఆమెకు మద్దతుగా ఎవరూ నిలబడలేదు కానీ ప్రకాష్ రాజ్ ఆమెకు మద్దతు ప్రకటించారు. ఆమె షేర్ చేసిన వీడియో ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ హ్యుమానిటీ అన్నింటికంటే ముందు అని.. సాయిపల్లవి మేము నీతోనే ఉన్నామంటూ ఆయన మద్దతు పలికారు. అయితే ప్రకాష్ రాజ్ మద్దతు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లు అయ్యిందని కొందరు అంటూంటే, మరికొందరు ... ప్రకాష్ రాజ్ అండగా నిలవడం మంచిదేనని అంటున్నారు. ఇంతకీ సాయి పల్లవి కామెంట్స్ ఏమంటే...
సాయి పల్లవి మాట్లాడుతూ... 'నక్సలైట్స్ ది ఒక ఐడియాలజీ, మనకు శాంతి అనేది ఓ ఐడియాలజి. నాకు వయలెన్స్ అస్సలు నచ్చదు. వయలెంట్‌గా ఉండి సాధించగలమని ఇప్పుడు నేను నమ్మను. ఆ టైంలో ఎవరికీ తెలియదు.. ఎక్కడికి వెళ్లాలి, ఏం చేయాలో తెలియదు. అందుకే వారంతా ఓ గ్రూపుగా మారారు. అయితే వాళ్లు చేసింది తప్పా, రైటా అని చెప్పలేను. నేను తటస్థ వాతావరణంలో పెరిగాను. లెఫ్టిస్ట్ మరియు రైటిస్ట్ గురించి విన్నాను. కానీ ఎవరు ఒప్పు, ఎవరు తప్పు అని నేను చెప్పలేను' అని అన్నారు.
'పాకిస్థాన్‌లో ఉన్న జనాలకి మన జవాన్లు టెర్రరిస్ట్‌లా అనిపిస్తారు. ఎందుకంటే మనం హార్మ్ చేస్తామనుకుంటారు. మనకు కూడా వాళ్లు అలానే కనిపిస్తారు. ఏది తప్పు ఏది రైట్ అని చెప్పడం చాలా కష్టం. మా ఫ్యామిలీలో లెఫ్ట్, రైట్ అని ఉండదు. అందులో ఎవరు రైట్, ఎవరు రాంగ్ అని చెప్పలేను. మనం మంచిగా ఉండి, ఎవరిని హార్ట్ చేయకుండా ఉంటే చాలు. బాధితుల గురించి ఆలోచించాలి' అని సాయి పల్లవి పేర్కొన్నారు.
