తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీజేపీతో పొత్తుపెట్టుకొని, మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ని ప్రకాష్ రాజ్ విమర్శించారు. బీజేపీ కంటే ఎక్కువ ఓటు షేర్ కలిగిన పవన్ వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం ఏమిటని అన్నారు. మోడీని ఒకప్పుడు విమర్శించిన పవన్ ఇప్పుడు పొగుడుతున్నాడని, పవన్ నిలకడ లేని రాజకీయాలు చేస్తున్నాడు అన్నాడు. పవన్ తీరు బాగా నిరాశపరిచిందన్న నాగబాబు, పవన్ ని ఊసరవెల్లితో పోల్చాడు. 

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు నాగబాబు స్పందించడంతో పాటు, అతనికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. రాజకీయాలలో నిర్ణయాలు మారుతూ ఉంటాయని, పార్టీ మరియు ప్రజల ప్రయోజనాల కోసం తప్పదని అన్నాడు. ఇక ప్రకాష్ రాజ్ డబ్బలు , డేట్స్ విషయంలో నిర్మాతలను వేధించాడని అన్నాడు. అలాగే పవన్ గురించి మాట్లాడే ముందు వళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అన్నాడు.నాగబాబు ట్వీట్ కి ప్రకాష్ రాజ్ రిప్లై ఇచ్చాడు. 

'గౌరవనీయులైన నాగబాబుగారికి, మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయ్యింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు' అని ట్వీట్ చేశాడు. తమ్ముడు పవన్ మీద ప్రేమతో నిజాలు గుర్తించ లేని స్థితిలో ఉన్నావన్న అర్థంలో నాగబాబుకు ప్రకాష్ రాజ్ సెటైర్ వేశాడు. మరి ప్రకాష్ రాజ్ కౌంటర్ కి నాగబాబు ఎలా స్పందిస్తాడో చూడాలి. మరో వైపు పవన్ ఫ్యాన్స్ సైతం ప్రకాష్ రాజ్ పై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో హేట్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.