Asianet News TeluguAsianet News Telugu

నన్ను చంపేంత పిరికి వాళ్లున్నారా.. భయపడితే చచ్చినట్టే.. ప్రకాశ్ రాజ్

  • ప్రశ్నించకుండా వుండేంత పిరికివాడిని కాదంటున్న ప్రకాశ్ రాజ్
  • తనను చంపే పిరికి వాళ్లు కూడా వున్నారా అంటున్న ప్రకాష్
  • రాజకీయాలపై అస్సలు ఆసక్తే లేదంటున్న విలక్షణ నటుడు
prakash raj emotional and strong interview

ప్రకాశ్ రాజ్ విలక్షణ నటుడు. సినిమాలపైనే కాకుండా సమాజంపైనా అమితమైన ప్రేమ ఉంటుంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని జస్ట్ ఆస్కింగ్ పేరుతో నిలదీస్తున్నాడు. గౌరీ లంకేష్, జీఎస్టీపై ఆయన ప్రశ్నించడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. నేను జాతి వ్యతిరేకిని కాను. ప్రభుత్వాల పనితీరును నేను ప్రశ్నిస్తున్నాను. అంతే కాని ఎవరిని టార్గెట్ చేయడం లేదు అని అన్నారు.

 

తను ఏదో రాజకీయాల కోసం మాట్లాడటం లేదని, అసలు రాజకీయాలపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు ప్రకాష్ రాజ్. నాకు చేతిలో ఆఫర్లు తగ్గినందున్న రాజకీయాల వైపు ప్రకాశ్ రాజ్ చూస్తున్నాడని అనడం తప్పు. ఎందుకంటే నేను తెలుగులో రెండు మహేశ్ బాబు సినిమాలు, రాంచరణ్ సినిమా, తమిళంలో ఒకటి, మలయాళంలో రెండు మోహన్ లాల్‌తో కన్నడలో మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. దాదాపు ఏడాదిన్నర వరకు డేట్స్ లేవు.

 

అట్టడుగు సమాజం నుంచి ఓ స్థాయికి చేరుకొన్న నాకు సొసైటీలో జరుగుతున్న అన్యాయాన్ని పశ్నించకపోతే నేను పిరికివాడిని అవుతాను. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిని నేను. ఈ సొసైటీలో జీవిస్తున్నాను. టాక్స్ కడుతున్నాను. దేశానికి సేవ చేస్తున్నాను. ఇన్ని రకాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న పౌరుడిగా ప్రశ్నించడంలో తప్పేమీ లేదు.

 

గౌరీ లంకేష్ హత్యపై తీవ్రంగా స్పందించాను. ఎందుకంటే నాకు చాలా సన్నిహితురాలు. గౌరీ తండ్రి లంకేష్ ఎలాంటి వ్యాపార ప్రకటన లేకుండా ఓ పత్రికను నడిపిన వ్యక్తి. ఆయన నాకు స్పూర్తి. ఆయన నాకు ఒకటే చెప్పేవాడు. నీ ఫ్రెండ్ అధికారంలో ఉన్నా సరే.. నీవు ప్రశ్నించడానికి ప్రతిపక్షంగా మారు. అప్పుడే సమాజానికి మంచి జరుగుతుంది అని లంకేష్ చెప్పాడు. చావు నా గడప ముందు కనిపించినందునే నేను ప్రశ్నించాల్సి వచ్చింది.

 

గౌరీ లంకేష్ హత్యను కొందరు వేడుకగా జరుపుకుంటే నాకు బాధేసింది. పన్సేరే హత్య గానీ, కేరళలో బీజేపీ కార్యకర్తల హత్యలు గానీ నాకు నచ్చడం లేదు. ఎవరైనా సరే హత్య చేయడాన్ని వ్యతిరేకిస్తాను. నేను ఓటు వేయకపోయినా నాకు ప్రధాని మోదీనే. నేను ప్రశ్నించడం మోదీకి వ్యతిరేకం కాదు. నేను మాట్లాడిందాంట్లో వాళ్లకు కావాల్సిందే తీసుకుని మిగతాది వదిలేస్తే అది నాతప్పు కాదు.

 

గౌరీ లంకేష్ హత్యను ఖండించినందుకు నాపై దాడి జరుగుతుందో ఏమో అని భయపడటం లేదు. ఎందుకంటే నన్ను చెక్కిన సాహిత్యం. నన్ను పెంచిన సమాజం. నాకు అన్నం కలిపి తినిపించిన నా తల్లి నాకు భయాన్ని నేర్పించలేదు. భయపడితే నేను చచ్చిపోయినట్టే. నేను ప్రశ్నించకపోతే నేను శవంతో సమానమే అంటూ వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజ్.

 

పద్మావతి సినిమాపై చెలరేగుతున్న వివాదంపై కూడా స్పందిస్తున్నాను. అధికారుల తీరును ప్రశ్నిస్తున్నాను. నేను ప్రశ్నిస్తే హిందుత్వ వాదులు తమను ప్రశ్నిస్తున్నారనే భావనలో ఉంది. సంజయ్ లీలా భన్సాలీని కొట్టడం, ఆయన షూటింగ్ చేస్తున్న సెట్‌ను తగలపెట్టడం చాలా దారుణం. మనమంతా ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే హక్కు ఎవరిచ్చారు.

ప్రధాని మోదీతో నాకు ఎలాంటి వైరం లేదు. జీఎస్టీపై ప్రశ్నించాను. ఎందుకంటే చేనేత ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీ విధిస్తే కార్మికులు ఎలా బతుకుతారు. గ్రామీణ వ్యవస్థ ఏమైపోతుందో అనే భయం పట్టుకొన్నది.

 

వారి ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ వారు అమలు చేసిన నోట్ల రద్దు విధానం చాలా తప్పు తప్పుగా ఉంది. నేను దత్తత తీసుకొన్న గ్రామంలో పొలం అమ్ముకున్న ఓ కుటుంబం 35 లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్ చేయలేక ఆత్మహత్య చేసుకొన్నది. నోట్ల రద్దు వల్ల వాళ్లు అనుకొన్న లక్ష్యం నెరవేరలేదు. దేశం మొత్తం చాలా కష్టాలు అనుభవించింది. ఇలాంటి వాటిని ప్రశ్నించకపోతే పిరికివాడిని అనుకొంటారు.

 

ప్రకాశ్ రాజ్ క్రిస్టియన్. పాకిస్థాన్‌కు వెళ్లిపోతాడా? అని కామెంట్లు చేస్తున్నాను. నాకు మతం లేదు. నేను దేవుడి నమ్మను. నేను తమిళంలో మాట్లాడుతున్నాను. కేరళలో మలయాళం, కన్నడలో కన్నడ, ఆంధ్ర, తెలంగాణలో తెలుగు మాట్లాడుతాను. నాకు భాషాబేధం లేదు. నా సమాజ శ్రేయస్సే నాకు ముఖ్యం.

Follow Us:
Download App:
  • android
  • ios