పెద్ద తెరపై విజయం సాధించినవాళ్లు కాలక్రమేణ బుల్లి తెరపై ప్రవేశించటం కామన్ గా జరిగే ప్రక్రియ. అలాగే బుల్లి తెరపై కనిపించే సెలబ్రెటీలు పెద్ద తెరపై చిన్న చిన్న పాత్రల్లో కనిపించి అలరిస్తూంటారు. అప్పుడప్పుడూ వారే ప్రధాన పాత్రలుగా చిత్రాలు తెరకెక్కుతుంటాయి కూడా. ఇప్పుడు బుల్లి తెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు సైతం అదే దారిలో వెళ్తున్నారు. 

తెలుగు టీవీ ప్రపంచంలో ప్రదీప్ ది ఓ ప్రత్యేకమైన అధ్యాయం.  హుందాగా తనదైన శైలిలో ఆకట్టుకునే యాంకర్ గా అతడికి అన్ని వర్గాల్లో  మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  గడసరి అత్త సొగసరి కోడలు', కొంచెం టచ్ లో ఉంటే చెప్తా' లాంటి ప్రోగ్రాల ద్వారా మహిళా ప్రేక్షకులకు ప్రదీప్ దగ్గరయ్యాడు. టీవీ మీడియాలో  భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న ప్రదీప్ హీరోగా మారటం ప్రమోషనే. ప్రదీప్ ఇప్పటికే అత్తారింటికి దారేటి వంటి కొన్ని సినిమాల్లో నటించాడు. కానీ హీరోగా మాత్రం చేయటం ఇదే మొదటి స్టార్. 

కొరియోగ్రాఫర్  అజయ్ సాయి మణికందన్ దర్శకత్వంలో ప్రదీప్ సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ప్రదీప్ బాడీ లాంగ్వేజ్ తగ్గ కామెడీ టైమింగ్, కొద్దిపాటి ఫ్యామిలీ సెంటిమెంట్ లాంటి అంశాలతో ఈ స్క్రిప్టుని రెడీ చేసారట. 

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కాగా,  సంక్రాంతి నాటికి అధికారికంగా ఈ సినిమాను ప్రారంభిస్తారని తెలుస్తోంది. హీరోగానూ ప్రదీప్ చక్కటి విజయాల్ని అందుకోవాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.