ప్రభాస్‌ వరుసగా నాలుగు సినిమాలకు కమిట్‌ అయ్యారు. అందులో `రాధేశ్యామ్‌` షూటింగ్‌ జరుపుకుంటోంది. దీంతోపాటు నాగ్‌ అశ్విన్‌తో ఓ సినిమా, బాలీవుడ్‌ చిత్రం `ఆదిపురుష్‌`, అలాగే `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో `సలార్‌` సినిమాలు చేయనున్నారు. ఇప్పటికే `సలార్‌` చిత్రం ప్రారంభమైంది. త్వరలోనే `ఆదిపురుష్‌` కూడా ప్రారంభం కాబోతుంది. మరోవైపు నాగ్‌ అశ్విన్‌ సినిమాపై సస్పెన్స్ నెలకొంది. ఈ సినిమా ఇప్పట్లో ఉంటుందా? మరో ఏడాది పట్టాల్సిందేనా? అనే డౌన్‌ వస్తోంది. 

నాగ్‌ అశ్విన్‌  సినిమాపై సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీనికి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. `కచ్చితంగా చెప్పాలంటే జనవరి 29, ఫిబ్రవరి 26` అని పేర్కొన్నాడు నాగ్‌ అశ్విన్‌. దీంతో సినిమాకి సంబంధించి జనవరి 29న గుడ్‌ న్యూస్‌రాబోతుందని ప్రభాస్‌ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ఆ రోజు సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ని ప్రకటించి, ఫిబ్రవరి 26న సినిమాని ప్రారంభిస్తారా? లేక ఈ రెండు తేదీలో స్పెషల్‌ అప్‌డేట్‌లు ప్రకటిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. మరో ఆరు రోజుల్లో ప్రభాస్‌ మరో గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నారనేది కన్ఫమ్‌ అయ్యింది. 

ఇక సైన్స్ ఫిక్షన్‌గా దాదాపు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతుంది. అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తుండగా, హీరోయిన్‌గా దీపికా పదుకొనె నటిస్తుంది. ప్యాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇతర భాషలకు చెందిన నటులు కూడా నటిస్తారని టాక్‌. ఇక ప్రస్తుతం రూపొందుతున్న `రాధేశ్యామ్‌` చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తుండగా, పెద్దనాన్న కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. పరమహంసగా ఆయన కనిపిస్తారట. ఈ సినిమాని ఏప్రిల్‌లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్‌.