బాహుబలి సినిమాతో ప్రభాస్‌ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ ఘన విజయం సాధించటంతో పాటు వందల కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నింటినీ పాన్ ఇండియా లెవెల్‌లోనే ప్లాన్ చేస్తున్నారు. సాహో సినిమాతో జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటిన ప్రభాస్ తదుపరి చిత్రాలన్నిటిని అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్పటికే రెండు సినిమాలను ప్రకంటించాడు ప్రభాస్. జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామలో నటిస్తున్నాడు. ఇటలీ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే లాక్‌ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని ప్రకటించాడు ప్రభాస్. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా పాన్‌ ఇండియా లెవల్‌లోనే రూపొందుతుంది.

తాజాగా ప్రభాస్‌కు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్ హృతిక్‌ రోషన్‌తో కలిసి ప్రభాస్‌ హీరోగా ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడట. తానాజీ ఫేం ఓం రౌత్‌ దర్శకత్వంలో ఈ మల్టీ స్టారర్‌ సినిమా తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు ప్రభాస్‌ ఓకే చెప్పినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ఇండియన్‌ సూపర్‌ స్టార్లు ఒకే యాక్షన్ సినిమాలో నటిస్తున్నారన్న వార్తలు వినిపిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.